రూ.1.25 కోట్లతో నిర్మించిన మార్కెట్ కమిటీ భవనాల ప్రారంభం
జైనూర్, ఆంధ్రప్రభ: ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, సముదాయ భవనాలను బుధవారం జిల్లా కలెక్టర్ కె. హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. అంతకుముందు పూజారి కులకర్ణి పండిత్ మహారాజ్ చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన మార్కెట్ కార్యాలయం ఆవరణలో ఈజీఎస్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు.
మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ కార్యాలయంతో పాటు 12 సముదాయ గదుల నిర్మాణం ద్వారా కమిటీకి ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రైతులు వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా అసలు రసీదులు తీసుకుని పంట కాలం ముగిసే వరకు భద్రపరచుకోవాలని సూచించారు.
నకిలీ విత్తనాల నియంత్రణకు వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యేలు కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు, వైస్ చైర్మన్ బానోత్ జైవంత్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్, ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, తహసీల్దార్ ఆడ బిర్షవ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇర్ఫాన్ అహ్మద్ ఖాన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.
