PowerLineStunt | ఫుల్లుగా తాగి.. క‌రెంట్ తీగాల‌పై ప‌డుకొని..

PowerLineStunt | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఏకంగా 11 కేవీ విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ తీగలపై పడుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకోగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం సేవించిన ఓ వ్యక్తి విద్యుత్ స్తంభంపైకి ఎక్కి, 11 కేవీ విద్యుత్ లైన్ వైర్లపై అడ్డంగా పడుకున్నాడు. అతడిని ఆ స్థితిలో చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళనతో వెంటనే పోలీసులకు, విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

కరెంట్ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ లైన్‌లో కరెంట్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది పరిస్థితిని సమీక్షించి, ఎంతో జాగ్రత్తగా అతడిని కిందికి దించే ప్రయత్నాలు చేపట్టారు. వ్యక్తి మత్తులో ఉండటంతో అధికారుల సూచనలను ఆ వ్య‌క్తి ప‌ట్టించుకోలేదు. దీంతో పోలీసులు, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో అతడిని సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. విద్యుత్ తీగలపై పడుకున్న వ్యక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకర చర్యలు ప్రాణాలకు ముప్పు తెస్తాయని హెచ్చరిస్తున్నారు.