జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

రూ.405 కోట్లతో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు ప్రారంభం

మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలపై సీఎం ప్రత్యేక దృష్టి

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపునిచ్చే జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు తొలి ప్లాంట్ యూనిట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించారు. అదే సందర్భంగా రెండో ప్లాంట్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాంతానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.

గోల్డ్ మైన్ ప్రాంతంలోని వ్యూ పాయింట్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. గనుల తవ్వకం, ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన సిమ్యులేటర్ రూమ్‌ను సందర్శించి, శిక్షణ పొందిన డ్రైవర్లు నిర్వహిస్తున్న ప్రత్యేక భారీ వాహనాలను ప్రారంభించారు. తర్వాత గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి, బంగారం ఉత్పత్తి ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి సాంకేతిక నిపుణులు, సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు.

అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తొలి ప్లాంట్ యూనిట్‌ను అధికారికంగా ప్రారంభించిన సీఎం, రెండో యూనిట్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేయడంలో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు ద్వారా తొలి దశలో ఏడాదికి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తదుపరి దశల్లో ఉత్పత్తిని 900 కిలోలకు పెంచి, భవిష్యత్తులో ఏటా 2 టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టును విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని, రాయలసీమలో పారిశ్రామిక వృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగావకాశాల కల్పనపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.