ఫేక్ ఫొటోలతో పోలవరం రాజకీయాలు…
ఫేక్ ఫొటోలతో పోలవరం రాజకీయాలు…
మట్టి దోపిడీ జగన్ హయాంలోనే
2023 నాటి ఫోటోలను 2026 ఘటనలుగా చూపిస్తూ వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం
2 లక్షల క్యూబిక్ మీటర్లు కాదు… 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం
నాడే అక్రమంగా తరలించారు
హైకోర్టు, ఎన్జీటీలో కేసులు ఉన్నాయి
నిజాలను దాచిపెట్టి తప్పుడు ప్రచారం
ఈడీ, సీబీఐ విచారణకు సిద్ధం
ఎంపీ కేశినేని శివనాథ్
ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: పోలవరం కుడి కాలువ మట్టి దోపిడీ అంశంపై వైసీపీ, ఒక మీడియా చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధాలపై ఆధారపడిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విజయవాడలోని గురునానక్ కాలనీలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ మీడియా కలిసి పాత ఫోటోలను కొత్తవిగా చూపించి ప్రభుత్వంపై బురదజల్లే కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిరోజూ ఒక కొత్త కథ అల్లడం, మరుసటి రోజే దానిలోని అబద్ధాలు బయటపడడం వైసీపీకి అలవాటైందని ఎద్దేవా చేశారు.
ఒక పత్రికలో ప్రచురించిన ఫోటో నిజమైనదేనని, అయితే అది 2023 ఫిబ్రవరి 9న పోలవరం కుడి కాలువ వద్ద తీసిన ఫోటో అని స్పష్టం చేశారు. ఆ సమయంలో జరిగిన అక్రమ మట్టి తరలింపులను నేటి ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని విమర్శించారు. ఫోటోలో కనిపిస్తున్న జీటీఆర్ లారీల వివరాలు, ఆ రోజు పరిస్థితులను నిర్ధారించే గూగుల్ టేక్‌అవుట్ ఫోటోలు, జీపీఎస్ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
వాస్తవానికి పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమ తవ్వకాలు, మట్టి తరలింపులు అప్పటి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని, ఇప్పుడు వాటిని దాచిపెట్టి రాజకీయ ప్రచారం చేయడం దురుద్దేశపూర్వక చర్య అని పేర్కొన్నారు. వైసీపీ ప్రచారంలో చెబుతున్నట్లు రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి కాదు, దాదాపు రెండు కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి అక్రమంగా తరలించబడిందనే ఆరోపణలపై అప్పట్లోనే ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు కోర్టులను ఆశ్రయించారని చిన్ని తెలిపారు.
ఈ అంశంపై హైకోర్టులో కేసు నమోదైందని, 2022లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో కూడా పిటిషన్ దాఖలైందని చెప్పారు. రెండు లక్షలు, రెండు కోట్ల మధ్య తేడా కూడా తెలియకుండా ఆరోపణలు చేస్తున్న నాయకులు ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరమని విమర్శించారు.
అక్రమ మట్టి తరలింపుల ద్వారా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకుపోయారని, ఆ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిగితే అసలు లబ్ధిదారులు బయటపడతారని అన్నారు. వైసీపీ నేతలు ముందుగా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తారని, ఆ తర్వాత అదే కథనాన్ని సాక్షి పత్రికలో ప్రచురిస్తారని, అనంతరం పార్టీ నాయకులతో ప్రెస్‌మీట్లు పెట్టించి అబద్ధాలను నిజాలుగా చూపించే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.
ఒక మాజీ ఎంపీ, ఒక పార్టీ అధినేత, ఒక జిల్లా నాయకుడు కలిసి సమన్వయంతో ఈ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆధారాలు ఉంటే ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరిన ఆయన, తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కోర్టుల్లో నమోదైన కేసులు, ఎన్జీటీ రికార్డులు, గూగుల్ టేక్‌అవుట్ ఆధారాలు ఎప్పటికీ చెరగవని, నిజాలు చివరికి వెలుగులోకి వస్తాయని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చిన్ని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను బయటపెట్టడంలో ప్రభుత్వం వెనుకాడదని, పోలవరం ప్రాజెక్టును రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. పాత ఫోటోలను కొత్తవిగా చూపించి ప్రచారం చేసినా కోర్టు రికార్డులు మారవని, ప్రజలు నిజానిజాలు గుర్తించే స్థాయికి చేరుకున్నారని అన్నారు.
