డీఏపీ ఎరువు అందించాలి.. రాహుల్, రేవంత్‌కు సెల్ఫీలతో రైతుల వినతి

డీఏపీ ఎరువు అందించాలి.. రాహుల్, రేవంత్‌కు సెల్ఫీలతో రైతుల వినతి

ఇచ్చోడ, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు తక్షణమే సరిపడా డీఏపీ ఎరువులు అందించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామ రైతులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి ఆధ్వర్యంలో రైతులు తమ పంట చేనుల్లో సెల్ఫీలు దిగి వాటిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించారు.

ఈ సందర్భంగా గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పత్తి, సోయాబీన్ పంటల సాగుకు సిద్ధమయ్యారని, అయితే మార్కెట్లో డీఏపీ ఎరువులు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పత్తి, సోయాతో పాటు ఇతర పంటలకు కూడా డీఏపీ అవసరమని, కానీ రైతులకు అది దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

డీఏపీ గురించి వ్యవసాయ అధికారులను ప్రశ్నిస్తే, దానికి బదులుగా 20-20-0-13 ఎరువును వాడాలని సూచిస్తున్నారని తెలిపారు. అయితే డీఏపీతో పోలిస్తే ఆ ఎరువు ధర సుమారు రూ.1,000 వరకు ఎక్కువగా ఉండటంతో రైతులపై అదనపు భారం పడుతోందన్నారు.

గతంలో రైతులకు అవసరమైన మేరకు డీఏపీ, యూరియా ఎరువులు అందుబాటులో ఉండేవని, ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ అడిగినా డీఏపీ లేదనే సమాధానం వస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎలాంటి లింక్ విధానం లేకుండా రైతులకు సరిపడా డీఏపీ ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. డీఏపీతో పాటు ఇతర ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించే లింక్ విధానం అమలు చేస్తే రైతులపై మరింత ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విఠల్, దత్త, నర్సింగ్, మారుతి, తులసీరాం, నాగ్‌నాథ్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.