Gen Z Challenges Traditional Politics | నేతలూ.. జెన్‌ఆల్ఫా చూస్తోంది.. పారాహుషార్..!

Gen Z Challenges Traditional Politics | నేతలూ.. జెన్‌ఆల్ఫా చూస్తోంది.. పారాహుషార్..!

Gen Z Challenges Traditional Politics | కాలంతో పాటు మారకుంటే అధోగతే

యువతరం ఆలోచనల్ని గుర్తించండి

కులాల రగడ.. నేతల వింతపోకడ

మారుతున్న కొత్తతరం ప్రాధాన్యతలు

Gen Z Challenges Traditional Politics | ఆంధ్రప్రభ, అమరావతి పొలిటికల్ బ్యూరో: మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. లేదంటే వెనుకబడిపోతాం. ఇది తరతరాలుగా వినిపిస్తున్న మాటే. అయితే, ఇప్పుడు ఈమార్పు మరింత స్పీడందుకుంది. ఆ వేగాన్ని అందుకోలేకుంటే సమాజం లెక్కచేయదన్నది నేటి ఉవాచ. ఈ విషయంలో రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాలానుగుణ మార్పులను స్వీకరించకుంటే రాజకీయ నేతలు కనుమరుగు కావడం తథ్యం.

90వ దశకం నుంచి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. సమాచార రంగం ఒక్కసారిగా పెటిల్లున్న విచ్చుకాలంతోపాటు మారకుంటే అధోగతే.

రేడియో, టీవీల నుంచి కంప్యూటర్, సెల్ఫోన్ వరకూ అనూహ్య మార్పులు వచ్చాయి. జెనీ (1990 తర్వాత పుట్టిన) తరం, జెన్ ఆల్ఫా (2010 తర్వాత పుట్టిన) తరం ఇప్పుడు సమాజాన్ని నడిపించడమే కాదు శాసిస్తున్నాయి. ఎవరు అవునన్నా, కాదన్నా వీరు నడుస్తున్నదే రహదారి… కాదు కూడదంటే మనల్ని పట్టించుకోకపోవడమే కాదు.. అడొస్తే తొక్కుకుంటూ పోతున్నారు.

గత మూడు, నాలుగు దశాబ్దాలుగా గమనిస్తే, అనేకానేక పరిణామాలు ఇదే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో కూడా వీటిని పరిగణించి, మన్నించి, గౌరవించి, తదనుగుణంగా నడుస్తున్న నేతల్నే ఈ తరం ఆదరిస్తోంది. కాదంటే అధోగతే.

కులాల రగడ.. నేతల వింతపోకడ..

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్న జెనీ, జెన్ ఆల్ఫా ఒకింత ఆశ్చర్యానికి గురవుతోంది. మరోపక్క తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం కూడా వారిలో గూడుకట్టుకుంటోంది.

ఏపీలో కులాల రగడ అంతా ఇంతా కాదు, ఏ వర్గాన్ని, పార్టీని, నేతలను కదిలించినా ఇదే రగడ..! ఒకపక్క గూగుల్ వంటి టెక్ దిగ్గజం, మరోపక్క ఆర్సెలార్ వంటి స్టీల్ కింగ్లు లక్షలాది కోట్లు పెట్టుబడులు పెట్టి ముందుకు సాగుతున్నాయి. మరోపక్క ఐటీని మించిన క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్ సిటీ, దేశ రక్షణ రంగానికి సంబంధించిన దిగ్గజాలు శరవేగంగా దూసుకుపోతుండగా, ఇంకా కులాల రగడ ఏమిటన్నది జెనీ, జెన్ ఆల్ఫాల నుంచి ఎదురవుతున్న ప్రశ్న.

యువతరం విశాల దృక్పథం..

పరిస్థితి ఇలా ఉండగా, 90వ దశకం నుంచి వాస్తవాల్ని గమనిస్తే ఆశ్చర్యకర అంశాలు కనిపిస్తున్నాయి. గత యాభై సంవత్సరాలుగా మ్యారేజ్ బ్యూరోని దిగ్విజయంగా నడిపిస్తున్న ఒక నిపుణుడిని కదిలిస్తే కాలం ఎంత వేగంగా మారుతోందో అర్థం చేసుకోవచ్చు.

మొదట్లో ఏ కులానికి ఆ కులం చొప్పున సాఫ్ట్వేర్ ఉండేది. వారి మధ్యే సంబంధాలు చూసేవారు. రానురాను వేగంగా మార్పులు వచ్చేశాయి. ముందుగా ఆస్తులు ఉంటే చాలు కులం పరవాలేదు నుంచి చదువు ఉంటే చాలు అనే వరకూ వచ్చింది. ఇప్పుడు ఆస్తి, చదువుతో పాటు ఉద్యోగం కూడా పరిగణనలోకి తీసుకుని కులాన్ని వదిలేశారు.

కుల రాజకీయాల పప్పులుడకవ్

సమాజంలో నేపథ్యం ఇలా ఉంటే ఇంకా కొందరు రాజకీయ నాయకులు తాత్కాలిక లబ్ధి కోసం చేస్తున్న కుల రగడలు ఇప్పుడు జెనీ, జెన్ ఆల్ఫాలకు వినోదంగా మారిపోయాయి.

సోషల్ మీడియాలో ముఖ్యంగా రీల్స్ను గమనిస్తున్నారా అని ఇటీవల దేశ ప్రధాని మోడీ సహచర మంత్రివర్గాన్ని ప్రశ్నించినట్టు వార్తలు వచ్చాయి. అంటే, సోషల్ మీడియాను నిశితంగా గమనిస్తూ మారుతున్న జెనీ అభిప్రాయాలను గమనించకుండా ఇంకా పాతకాలం రాజకీయాలు నడిపితే చెల్లవని ఆయన నేరుగానే చెప్పేశారు.

దాదాపు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసిన, చేస్తున్న మోడీ అంతటి వారే జెనీని గౌరవిస్తుంటే, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో కులాల రచ్చ చేస్తూ రాజకీయం చేస్తున్న నేతలు ఇప్పటికైనా కాలానికి అనుగుణంగా మారాలి. లేకుంటే అంతే సంగతులు.

ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన కులాలుగా చెప్పుకుంటున్న వారిలో 30 శాతం మంది ఇతర కులాల వారి సంబంధాలు కుదుర్చుకుని, కుదుటపడుతున్నారని, ఇది వచ్చే రెండేళ్లలో 50 శాతానికి వేగంగా చేరుకుంటుందని ఆ మ్యారేజ్ బ్యూరో అధినేత అంచనా వేశారు.

సోషల్ మీడియాలో జెనీ, జెన్ ఆల్ఫా మహాసముద్రం ఉందన్న సంగతి కూడా వారికి తెలియకపోవడం శోచనీయం.