డ్రగ్స్, బెల్ట్ షాపులపై ఎక్సైజ్ ఉక్కుపాదం
ఉరవకొండ, ఆంధ్రప్రభ: ఉమ్మడి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎస్.కె.డి.వి. ప్రసాద్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రామ్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్ షాపులు, బహిరంగ మద్యపానం నిర్మూలనకు విస్తృతంగా తనిఖీలు, దాడులు చేపట్టినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ రవిచంద్ర తెలిపారు.
ఈ దాడుల్లో భాగంగా ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం అమ్మకాలపై ఆరు కేసులు, బహిరంగ మద్యపానానికి సంబంధించి ఐదు కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు బహిరంగ మద్యపానంపై తీసుకునే చర్యల గురించి అవగాహన కల్పించినట్లు తెలిపారు.
జూన్ 26న నిర్వహించనున్న మాదకద్రవ్య దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా డ్రగ్స్ మహమ్మారి వల్ల యువత, సమాజంపై పడుతున్న దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. డ్రగ్స్ అమ్మకాలు, అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎక్కడైనా డ్రగ్స్, అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే అధికారులకు తెలియజేసి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అక్రమ మద్యం, డ్రగ్స్ నిర్మూలన కోసం దాడులు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
