బాసర ఆలయ చోరీ ఘటన.. ఐదుగురు హోంగార్డులపై వేటు!
- భద్రతా విధుల్లో నిర్లక్ష్యం.. సరెండర్ చేయాలని ఎస్పీకి ఈఓ లేఖ
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఉన్న మహంకాళి ఆలయ చోరీ ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ భద్రతా విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు హోంగార్డులను సరెండర్ చేయాలని కోరుతూ ఆలయ ఈఓ అంజనీదేవి జిల్లా ఎస్పీకి లేఖ రాశారు.
సోమవారం రాత్రి ఆలయ భద్రత కోసం మొత్తం ఆరుగురు హోంగార్డులు విధుల్లో ఉండాల్సి ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే విధులు నిర్వహించినట్లు ఈఓ పేర్కొన్నారు. భద్రతా లోపాల కారణంగానే చోరీ ఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్న అధికారులు, బాధ్యులపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో విధుల్లో గైర్హాజరైన ఐదుగురు హోంగార్డులపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఆలయ చోరీ ఘటనపై ఇప్పటికే విచారణ కొనసాగుతుండగా, భద్రతా వైఫల్యంపై కూడా అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
