డ్రగ్స్, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి
మోత్కూర్, ఆంద్రప్రభ: గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల పట్ల యువత,విద్యార్థులు దూరంగా ఉండాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల హాస్టల్ లో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ సి. వెంకటేశ్వర్లు , ఎస్‌ఐ కె. సతీష్ , ఎఎస్‌ఐ వెంకన్నలు పాల్గొని విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి వివరించారు.
డ్రగ్స్‌కు బానిసైతే ఆరోగ్యం, విద్య, కుటుంబ జీవితం , భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, మంచి అలవాట్లు అలవరచుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడి వారిలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి కనబరిస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ మొలకల స్వామి, హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.
