వివాహిత మృతి ఘటనలో నలుగురిపై కేసు
మరిపెడ, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఓ వివాహిత మృతి చెందిన ఘటనకు సంబంధించి నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయాన్ని మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఏనేకుంట తండాకు చెందిన కేలోత్ శిరీష (23), భర్త రాజుతో కలిసి మరిపెడ మండలం బురహాన్‌పురం గ్రామంలో కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన జంపల్లి బాలకృష్ణ తనను కొంతకాలంగా వేధిస్తున్నాడని శిరీష కుటుంబ సభ్యులకు తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయమై సుమారు ఆరు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించినట్లు సమాచారం. అయితే ఈ నెల 17న ఇరు కుటుంబాల మధ్య మరోసారి వివాదం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జంపల్లి బాలకృష్ణ, విజయతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు తనను దూషించారని శిరీష భర్త రాజు ఫిర్యాదులో ఆరోపించారు.
అనంతరం శిరీష పురుగుల మందు సేవించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 21న మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలికి భర్త రాజుతో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
మృతురాలి భర్త రాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జంపల్లి బాలకృష్ణ, విజయతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.
