వందల కిలోల గంజాయి భస్మీకరణ

ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పట్టుబడిన మాదకద్రవ్యాల ధ్వంసం
అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా చర్యలు
యడ్లపాడులో శాస్త్రీయ పద్ధతిలో అగ్నికి ఆహుతి
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు అధికారుల పిలుపు

ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వివిధ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భారీ మొత్తంలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను మంగళవారం శాస్త్రీయ పద్ధతిలో భస్మీకరణ చేశారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పరిశ్రమలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 363.549 కిలోల గంజాయి, 20 గ్రాముల ఎండీఎంఏ, 68.600 కిలోల ఇతర ఎన్‌డీపీఎస్ సంబంధిత పదార్థాలను పూర్తిగా ధ్వంసం చేశారు.

అలాగే కృష్ణా జిల్లాకు చెందిన 910.905 కిలోల గంజాయిని కూడా ఇదే సందర్భంగా భస్మీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, విజయవాడ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి. శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు, విజయవాడ, గుంటూరు అసిస్టెంట్ కమిషనర్లు చి. లావణ్య, రవికుమార్, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి నజీనా బేగం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పలువురు ఎక్సైజ్ సీఐలు, సిబ్బంది, జిందాల్ ప్లాంట్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ఎం.వి. చారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.