ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల
- డిగ్రీ, పీజీ కోర్సులకు ప్రవేశాలు..
- ఆగస్టు 7 వరకు అవకాశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ పీజీ కోర్సులు, వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ లేదా ఓపెన్ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి అని పేర్కొన్నారు.
ఆన్లైన్ దరఖాస్తుల నమోదు, ఫీజు చెల్లింపునకు ఆగస్టు 7 చివరి తేదీగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరాలు, పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా తమ ట్యూషన్ ఫీజులను ఆగస్టు 7లోపు చెల్లించాలని సూచించారు.
ఆసక్తి గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం సమీప అధ్యయన కేంద్రాన్ని సంప్రదించవచ్చని, లేదా హెల్ప్‌డెస్క్ నంబర్లు 7382929570, 040-23680222, 040-23680333, 18005990101లో సంప్రదించాలని సూచించారు.
