అందరి సమన్వయంతోనే ‘సర్‌’ విజయవంతం

11వ డివిజన్‌లో సర్‌ జరుగుతున్న తీరును పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

పటమట, ఆంధ్రప్రభ : వోటర్లు, బీఎల్‌వోలు, రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏల సమన్వయంతో ఉంటేనే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – సర్ కార్యక్రమం విజయవంతమవుతుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. మంగళవారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 11వ డివిజన్‌, హైస్కూల్‌ రోడ్డు నందు, నారాయణ టీ-స్టాల్‌ రోడ్డులో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. అనంతరం డివిజన్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌) కార్యక్రమం తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ బీఎల్‌వోలు, ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏలందరూ కలిసి సమన్వయంతోనే పనిచేస్తేనే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమమైన సర్ విజయవంతం అవుతుందని తెలిపారు. బీఎల్‌వోలకు నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించి ఆ సమయంలో వారికి ఈ సర్‌లో భాగమైన పనే చేసేలా అధికారులు చూడాలన్నారు. బీఎల్‌వోలకు ఎదురవుతున్న ఇబ్బందులను తాను ఉన్నతాధికారులకు తెలియజేశానని చెప్పారు. 25 సంవత్సరాల క్రితం చనిపోయిన వారి పేర్లు కూడా ఇప్పటికి ఓటరు జాబితాలో ఉన్నాయని, ఇలాంటి లోపాలను సరిచేసేందుకు ‘సర్‌’ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

సర్‌ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలోని లోపాలను పూర్తి స్థాయిలో సరిదిద్దేందుకు అవకాశం ఉందన్నారు. బీఎల్‌వోలు నూటిని నూరు శాతం వారికి కేటాయించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. సర్‌ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు వారికి కేటాయించిన ప్రాంతంలోని ఇళ్ళకు మూడు సార్లు వెళ్ళి స్పష్టమైన సమాచారాన్ని సేకరిస్తారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. పార్టీకి చెందిన బీఎల్ఏలు కూడా అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాధికారులకు అనుసంధానంగా ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమలో బీఎల్‌వో శేఖర్‌ ఆచార్య, పార్టీ నాయకులు నాదెళ్ల రాజేష్, ముమ్మనేని ప్రసాద్, కోనేరు రాజేష్, బంగారు మురళి, కేశినేని శివ, కోనేరు కళ్యాణి, వల్లభనేని సుగుణ, కలగర మాధవి, నాదెళ్ళ రాజ్యలక్ష్మి, గద్దె రమేష్, గల్లా రవి, రొయ్యూరు శ్రీనివాసరావు, కంచర్ల రామారావు, గోగినేని రంగారావు, మల్లిపెద్ది భార్గవి తదితరులు పాల్గొన్నారు.