శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయానికి రాజగోపురం..

  • రూ.50 లక్షలతో నిర్మాణానికి శ్రీకారం

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పాడి పశుసంవర్ధక, క్రీడలు, డెయిరీ, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఆలయానికి సరికొత్త హంగులు అద్దే క్రమంలో రాజగోపురం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.50 లక్షలు మంజూరు చేయించారు.

తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. మక్తల్ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి రాజగోపురం నిర్మించాలని భక్తుల చిరకాల కోరికగా ఉండగా, దానిని సాకారం చేసే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి.

ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటలకు రాజగోపుర నిర్మాణానికి మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి భూమిపూజ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలించారు. రాజగోపుర నమూనాను ఖరారు చేయడంతో పాటు భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

రాజగోపుర నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి మక్తల్ ప్రాంత ప్రజలు, భక్తులు, హిందూ బంధువులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆలయ అధికారులు కోరారు. ఈ పరిశీలన కార్యక్రమంలో దేవాదాయ శాఖ డిప్యూటీ ఈఈ ఓం ప్రకాష్ రావు, ఏఈ రణధీర్, ఆలయ ఈవో నిత్యానందాచారి, వంశపారంపర్య ధర్మకర్త ప్రాణేశాచారి, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కవిత, అర్చకులు అరవిందాచారి, సిబ్బంది శ్రీనివాస్, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వాదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.