APL-2026 | ఏపీఎల్ తుది దశ పోటీలకు రాజధాని వేదిక..
నేడు తొలి మ్యాచ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాక..
జూన్ 30న గ్రాండ్ ఫైనల్‌కు మంత్రి నారా లోకేష్ హాజరు
అంతర్జాతీయ హంగులతో మెరిసిపోతున్న ఏసీఏ స్టేడియం
ఎనిమిది జట్ల మధ్య టైటిల్ కోసం హోరాహోరీ పోరు
క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏసీఏ భారీ ప్రణాళికలు
APL-2026 | ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో మరో కీలక ఘట్టానికి మంగళగిరి వేదిక కానుంది. రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 తుది దశ పోటీలు బుధవారం నుంచి మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. లీగ్ దశ నుంచి అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నీ ఇప్పుడు సెమీఫైనల్స్, ఎలిమినేటర్, క్వాలిఫయర్స్, ఫైనల్ దశకు చేరుకోగా, రాజధాని ప్రాంతం క్రీడా సంబరాలతో కళకళలాడనుంది. అత్యాధునిక సదుపాయాలతో సరికొత్త రూపును సంతరించుకున్న మంగళగిరి ఏ సీఏ స్టేడియం రాష్ట్ర క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయ అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది.

తుది దశకు లీగ్ పోటీలు..

ఏపీఎల్ సీజన్-5లో భాగంగా జూన్ 24 నుంచి 27 వరకు లీగ్ మ్యాచ్‌లు, జూన్ 28న ఎలిమినేటర్, క్వాలిఫయర్-1, జూన్ 29న క్వాలిఫయర్-2, జూన్ 30న గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫైనల్‌కు వర్షం లేదా ఇతర కారణాలతో అంతరాయం ఏర్పడితే జూలై 1ను రిజర్వ్ డేగా కేటాయించారు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్, భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, విజయవాడ సన్‌షైనర్స్, తుంగభద్ర వారియర్స్, కాకినాడ కింగ్స్ సహా ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.

ప్రత్యేక ఆకర్షణగా రామ్ చరణ్..
టోర్నీ ప్రారంభ వేడుకలకు సినీ నటుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానుండటంతో ఏపీఎల్ వేడుకలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలతో పాటు బీసీసీఐ అనుబంధ సంఘాల ప్రతినిధులు కూడా ఫైనల్ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉంది.
సరికొత్త హంగులతో ఏసీఏ స్టేడియం..
దాదాపు దశాబ్దకాలంగా పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాని మంగళగిరి స్టేడియం ప్రస్తుతం సరికొత్త హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) చొరవతో స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. ఆటగాళ్ల కోసం ఆధునిక డ్రెస్సింగ్ రూములు, డైనింగ్ హాల్స్, ఇండోర్ ప్రాక్టీస్ సెంటర్, జిమ్, ప్రసార కేంద్రాలు, కామెంటరీ బాక్సులు, వీఐపీ సూట్లు, మ్యాచ్ అధికారుల గదులు, అత్యాధునిక ఫ్లడ్‌లైట్స్‌తో పాటు మొత్తం 75 గదులను సర్వాంగసుందరంగా అభివృద్ధి చేశారు. మొత్తం 26 వేల మంది సామర్థ్యం కలిగిన ఈ స్టేడియంలో ప్రస్తుతం 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు అనువుగా ఏర్పాట్లు చేశారు. స్టేడియానికి అనుసంధానంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయడంతో పాటు ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను కూడా పటిష్టం చేశారు. ప్రతి మ్యాచ్ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద ప్రదర్శనలను నిర్వహించి ప్రేక్షకులకు క్రికెట్‌తో పాటు వినోదాన్ని అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పోటీలు..
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లీగ్ పోటీలు ఒక్క నగరానికే పరిమితమవుతుండగా, విశాఖపట్నం, కడప, మంగళగిరి వేదికలుగా ఏపీఎల్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం ద్వారా క్రికెట్‌ను గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేస్తున్నామని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఐపీఎల్ మాదిరిగానే ఏపీఎల్ కూడా భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లను అందించే వేదికగా మారుతుందని, రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అందరి చూపు మంగళగిరి వైపే…
క్రికెట్ పండుగకు రాజధాని ప్రాంతం సిద్ధమవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల చూపంతా ఇప్పుడు మంగళగిరి ఏసీఏ స్టేడియంపైనే నిలిచింది. టైటిల్ పోరులో ఎవరు విజేతగా నిలుస్తారన్న ఉత్కంఠతో పాటు, రామ్ చరణ్, నారా లోకేష్ రాకలతో ఏపీఎల్-2026 తుది దశ పోటీలు మరింత ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి.
