నంద్యాల జిల్లాలో భారీ వర్షాల బీభత్సం..

  • నేలకొరిగిన చెట్లు, ధ్వంసమైన వాహనాలు
  • ఎంపీడీవో కార్యాలయంలో భారీ వృక్షం కూలటం..
  • మూడు కార్లు ధ్వంసం..
  • జిల్లా వ్యాప్తంగా విభిన్న వాతావరణం..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పలు మండలాల్లో తీవ్ర నష్టం సంభవించింది. మహానంది, ఆత్మకూరు, ప్యాపిలి, ఆళ్లగడ్డ, రుద్రవరం తదితర ప్రాంతాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నంద్యాల పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, నూనెపల్లె ప్రాంతాల్లో భారీ చెట్లు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నంద్యాల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా కూలిపోవడంతో కింద పార్క్ చేసిన మూడు కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాహనాల పైభాగాలు నుజ్జునుజ్జు కాగా, యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షాలకు గడివేముల, రుద్రవరం, ఆళ్లగడ్డ, సిరివెళ్ల తదితర మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం పరిసరాలు, సలీంనగర్, అన్నానగర్, దేవనగర్, సంజీవనగర్, ఎన్జీవోస్ కాలనీ ప్రాంతాలు జలమయమయ్యాయి. సంజీవనగర్‌లో రహదారిపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మరో మూడు రోజులు వర్షాలే

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో గత నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల పాటు కూడా భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. సాగు పనులు ఊపందుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.