రైతులకు సరైన విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించాలి

రైతులకు సరైన విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించాలి

  • విత్తన మేళాలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచన

రేగొండ, ఆంధ్రప్రభ : రైతులు ప్రస్తుత, రానున్న వర్షపాత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు. మంగళవారం రేగొండ మండల రైతు వేదికలో నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులకు అధిక లాభాలు అందించే సన్న వడ్ల రకాలపై వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆయన అన్నారు.

ఈ ఏడాది వర్షపాతం అనుకూలంగా ఉన్నప్పటికీ తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై కూడా రైతులకు సూచనలు అందించాలని వ్యవసాయ, హార్టికల్చర్ శాఖ అధికారులను ఆదేశించారు. పంట మార్పిడి విధానాన్ని రైతులు అనుసరించేలా ప్రోత్సహించడంతో పాటు సరైన విత్తనాల ఎంపికలో రైతులకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, మండల వ్యవసాయ అధికారి, స్థానిక సర్పంచ్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్, పీఏసీఎస్ చైర్మన్, సంపత్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.