ఆలయంలో చోరీ ఘటనపై జిల్లా ఎస్పీ దర్యాప్తు

ఆలయంలో చోరీ ఘటనపై జిల్లా ఎస్పీ దర్యాప్తు

ఆలయ పరిసరాల పరిశీలన
త్వరలోనే నిందితులను పట్టుకుంటాం జిల్లా ఎస్పీ

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఉపాలయం మహాకాళి అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి చోరీ చోటుచేసుకుంది. మహంకాళి ఆలయ గేటు పగలగొట్టి చోరీ పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. అమ్మవారి వెండి కిరీటం, హుండీ తలలను పగలగొట్టి నగదు కాజేసి హుండీని వ్యాస గుహ దగ్గర పడేసి పరారయ్యారు. ఉదయం జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సేకరించిన ప్రాథమిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల పరిశీలన తదితర అంశాల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించిన ప్రతి కోణంలో దర్యాప్తు చేపట్టి, నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ఆలయ భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తును వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని, త్వరలోనే నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో అంజనీ దేవి, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు రవీందర్ నాయక్, సమ్మయ్య, ఎస్ఐ లు ఇతర పోలీసు సిబ్బంది, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.