OMCAP Andhra Pradesh | విదేశీ ఉద్యోగాల కోసం ఓంక్యాప్ ప్రత్యేక కార్యాచరణ
OMCAP Andhra Pradesh | విదేశీ ఉద్యోగాల కోసం ఓంక్యాప్ ప్రత్యేక కార్యాచరణ
OMCAP Andhra Pradesh | జర్మనీ, ఇటలీ దేశాల్లో భారీ ఉద్యోగ అవకాశాలు
జపాన్, గల్ఫ్ దేశాల్లో యువతకు డిమాండ్
ఐదేళ్లలో లక్షమందికి ఉపాధి కల్పన లక్ష్యం
OMCAP Andhra Pradesh | అమరావతి, ఆంధ్రప్రభ : విదేశాల్లో కొలువులకు ఏజెంట్ల చుట్టూ తిరిగి మోసపోయే రోజులకు కాలం చెల్లింది. విద్యార్హతలుండి, తామందించే నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే దగ్గరుండి ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటోంది ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఓంక్యాప్) సంస్థ. ప్రపంచస్థాయిలో రాష్ట్ర యువతకు అవసరమైన వనరులను గుర్తిస్తూ అవకాశాల వేదికగా నిలుస్తోంది. ఇతర దేశాల్లో స్థిరపడాలనే సంకల్పం, కొత్త భాషలు నేర్చుకునే ఉత్సాహం ఉంటే చాలు.. పాస్‌పోర్టుకు వీసా స్టాంప్ వేయించే బాధ్యత కూడా ఓంక్యాప్ తీసుకుంటోంది. ఈ ప్రస్థానంలో ఏటా వందల మందికి ఇతర దేశాల్లో కొలువులు పొందేందుకు వారధిగా నిలుస్తోంది.
వనరుల అన్వేషణలో ఓంక్యాప్
ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) సంస్థ అనునిత్యం ఏయే దేశాల్లో ఎలాంటి మానవ వనరుల కొరత ఉందో గుర్తించడంలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తోంది. ఆయా దేశాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఆయా దేశాల సంస్థలకు అవసరమైన నైపుణ్యాలేంటి? ఏ వర్గానికి చెందిన యువతకు వీటి ద్వారా ఉద్యోగావకాశాలను కల్పించవచ్చన్న విషయాలపై ఓంక్యాప్ దృష్టి సారిస్తోంది.
ఆయా మార్కెట్లలో ఉన్న వనరుల కొరతను ముందే పసిగట్టి, ఇక్కడి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చి, సరిహద్దులు దాటించే నమ్మకమైన వారధిగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ, జపాన్, ఇటలీ, దుబాయ్ వంటి దేశాల్లో ఉన్న అవకాశాలు, అందుకు కావాల్సిన అర్హతలపై ఈ సంస్థ కృషి చేస్తోంది.
జర్మనీలో ఆరోగ్యం.. ఇటలీలో సాంకేతిక రంగాల్లో అవకాశాలు
ప్రస్తుతం యూరప్ దేశాల్లో వృద్ధుల జనాభా పెరుగుతుండటంతో హెల్త్‌కేర్, నర్సింగ్ రంగాల్లో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. దీనిని యువతకు అనుకూలంగా మార్చేందుకు ఓంక్యాప్ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.
నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎం పూర్తి చేసిన వారికి జర్మనీలో వేల సంఖ్యలో అవకాశాలు ఉన్నాయి. ఇటలీ విషయానికి వస్తే వెల్డర్లు, పారిశ్రామిక టెక్నీషియన్లు, భారీ వాహనాల డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా పూర్తి చేసిన యువతకు ఇవి అద్భుతమైన అవకాశాలు.
జర్మనీ, ఇటలీ వంటి దేశాలకు వెళ్లాలంటే ఆయా దేశాల భాషలను అర్థం చేసుకోవాలి. మాట్లాడటం తెలిసుండాలి. ఈ నేపథ్యంలో ఓంక్యాప్ స్వయంగా అభ్యర్థులకు జర్మన్ భాషలో బీ1, బీ2 స్థాయిలపై శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ సంస్థలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో 3 వేల మందికి జర్మన్ భాషపై శిక్షణ ఇస్తోంది.
జపాన్‌లోనూ ఉద్యోగ మార్గాలు
టెక్నికల్ ఇంటర్న్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం జపాన్ భారత్ వైపు చూస్తోంది. టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అయిన జపాన్, టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏపీ యువతను పంపిస్తోంది.
కేర్ గివర్స్ (వృద్ధుల సంరక్షణ), కన్‌స్ట్రక్షన్ వర్కర్లు, మెషిన్ ఆపరేటర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ వంటి రంగాల్లో అవకాశాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, జపనీస్ భాష నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న యువతీ యువకులకు ఇది ఉత్తమ మార్గం. ఉచిత వసతితో పాటు నెలకు లక్షన్నరకు పైగా వేతనం సంపాదించే వీలుంటుంది.
దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఎన్నటికీ తగ్గని డిమాండ్
నిర్మాణ రంగం, ఆతిథ్య రంగాల్లో గల్ఫ్ దేశాలు ఎప్పుడూ ముందువరుసలో ఉంటాయి. ఎలాంటి మోసాలు లేకుండా సురక్షితంగా గల్ఫ్ వెళ్లాలనుకునే వారికి ఓంక్యాప్ ఓ రక్షణ కవచం. ఆతిథ్య రంగంలో సిబ్బంది, సివిల్ ఇంజనీర్లు, సూపర్‌వైజర్లు, ఎలక్ట్రిషియన్లు, ప్లంబర్లు, డ్రైవర్లు, ప్రొడక్షన్ లైన్ వర్కర్ల కొరత ఈ దేశాలను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఓంక్యాప్ ఎప్పటికప్పుడు నియామకాలు చేపడుతోంది.
ఈ ఏడాదిలో ఇప్పటిదాకా ఎంతమందికంటే..
- జర్మనీలో రేడియాలజిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్లుగా 26 మందిని పంపించనున్నారు. ప్రస్తుతం వీరంతా జర్మన్ భాష నేర్చుకుంటున్నారు.
- అలాగే జర్మన్ భాషలో బీ1, బీ2 లెవల్స్‌లో మరో 63 మంది శిక్షణ పూర్తి చేశారు. రానున్న మూడు నెలల్లో వీరికి వీసా ప్రక్రియ జరగనుంది.
- ఇదే దేశంలో ఆహార శుద్ధి రంగంలో 18 మందికి, ఎలక్ట్రిషియన్లుగా 18 మందికి అవకాశం కల్పించేందుకు మ్యాజిక్ బిలియన్ కంపెనీ శిక్షణ కల్పిస్తోంది.
- ఇంజినీరింగ్ రంగంలో 12 మందిని జపాన్‌కు పంపించారు.
- ఇటలీలో కార్పెంటర్లు, ఫోర్‌మెన్‌లు, వెల్డర్లుగా 8 మందికి అవకాశం కల్పించారు.
- దుబాయ్‌లో డ్రైవర్లుగా 45 మందికి ఉద్యోగాలు లభించాయి.
- మారిషస్‌లో షెల్ఫ్ వర్కర్లు, క్యాషియర్లుగా ఇద్దరికి కొలువులు దక్కాయి.
ఐదేళ్లలో లక్షమందికి అవకాశాలు
రాబోయే ఐదేళ్లలో అన్ని రంగాల్లో కలిపి దాదాపు లక్ష బ్లూ కాలర్, వైట్ కాలర్ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ సాయంతో ఓంక్యాప్ సేవలను మరింత విస్తృతం చేసేందుకు అడుగులు వేస్తున్నాం. ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలి? ఆయా దేశాల సంస్కృతికి ఎలా అలవాటు పడాలి? అనే విషయాలపై అభ్యర్థులకు శిక్షణలోనే భాగంగా అవగాహన కల్పిస్తున్నాం.
– జి. గణేశ్‌కుమార్, మేనేజింగ్ డైరెక్టర్, ఓంక్యాప్
