HYD | తెలంగాణలో వాన‌లే వాన‌లు

HYD | తెలంగాణలో వాన‌లే వాన‌లు

ఉత్తర జిల్లాల్లో ఐదు రోజులపాటు జోరు వాన‌..
వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా పలు జిల్లాలకు హెచ్చరిక
ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

HYD |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత విస్తరిస్తుండటంతో రానున్న ఐదు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ వివరాల ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరకు విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ జిల్లాల్లో వర్షాల ప్రభావం
కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాల్లో రాబోయే రెండు నుంచి మూడు గంటల్లోనే వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవొద్దని అధికారులు సూచించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

రానున్న రోజుల్లో మరింత విస్తరణ
నైరుతి రుతుపవనాలు తెలంగాణలో మరింతగా విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని మరిన్ని జిల్లాల్లో కూడా రాబోయే రోజుల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు, వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఉపశమనం లభించనుంది.