చాచా ఎక్ చాయ్… టీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్!

  • స్విగ్గీ డిజిటల్ రిపోర్ట్‌లో తేలిన చాయ్ ప్రేమ!

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఘుమఘుమలాడే దమ్‌ బిర్యానీ. కానీ, భాగ్యనగరవాసులకు బిర్యానీతో పాటు ఇరానీ చాయ్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం లేచింది మొదలు అర్ధరాత్రి వరకు ఇక్కడి హోటళ్లు, కేఫ్‌లు చాయ్ లవర్స్‌తో కిటకిటలాడుతుంటాయి. అయితే, కేవలం హోటళ్లకు వెళ్లి తాగడమే కాదు.. కూర్చున్న చోటికే ఆన్‌లైన్‌లో చాయ్ ఆర్డర్ చేయడంలోనూ నగరవాసులు సరికొత్త రికార్డు సృష్టించారు.

ప్రముఖ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌ స్విగ్గీ విడుదల చేసిన తాజా డిజిటల్ నివేదిక ప్రకారం, దేశంలో అత్యధికంగా టీ ఆర్డర్ చేసే నగరాల జాబితాలో హైదరాబాద్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబై తొలి స్థానంలో నిలవగా, బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది.

ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్థులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ చాయ్ టైమ్ ఒక రిఫ్రెష్‌మెంట్ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఆఫీసుల్లో మీటింగ్‌లు ఉన్నా, ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టాలన్నా చాయ్ కప్పు ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా భారీ ఎత్తున టీ ఆర్డర్లు వస్తున్నాయని, ఇది నగరవాసులకు టీపై ఉన్న అపరిమితమైన మక్కువకు నిదర్శనమని స్విగ్గీ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరానీ చాయ్, అల్లం టీ, మసాలా చాయ్, గ్రీన్ టీ.. ఇలా వెరైటీ ఏదైనా సరే, కప్పు పడితేనే కానీ హైదరాబాద్ నెత్తిన సూర్యుడు పొడవడు అనే సామెతను మన చాయ్ ప్రియులు నిజం చేసి చూపించారు.