Tirupati | కేఎఫ్‌సీలో భారీగా చికెన్ నిల్వలు..

  • అధికారుల తనిఖీల్లో వెలుగులోకి లోపాలు
  • ఆహార భద్రత నిబంధనల ఉల్లంఘనపై నోటీసులు

తిరుపతి, ఆంధ్రప్రభ: నగరంలోని ప్రముఖ మల్టీనేషనల్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కేఎఫ్‌సీ ఔట్‌లెట్లలో పలు లోపాలు బయటపడ్డాయి. భారీ మొత్తంలో చికెన్‌ను నిర్దేశిత ప్రమాణాలకు విరుద్ధంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సూచనల మేరకు కమిషనర్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ, పారిశుద్ధ్య విభాగాల అధికారుల బృందం శుక్రవారం నగరంలోని డొమినోస్, కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, సబ్‌వే రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించింది.

కేఎఫ్‌సీలో గుర్తించిన లోపాలు…

భవానీనగర్, ఎయిర్ బైపాస్ రోడ్డులోని కేఎఫ్‌సీ ఔట్‌లెట్లలో బెంగళూరు నుంచి తెచ్చిన సుమారు 684 కిలోలు, 683 కిలోల చికెన్‌ను నిర్దేశిత ర్యాక్‌లలో కాకుండా నేలపై నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. చికెన్ నుంచి దుర్వాసన వస్తుండటంతో పాటు ప్రజల వినియోగానికి అనుకూలంగా లేని పరిస్థితులు కనిపించినట్లు వెల్లడించారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలపై తయారీ, గడువు తేదీలకు సంబంధించిన లేబుళ్లు లేకపోవడం, స్టోర్‌రూమ్‌ల నిర్వహణలో లోపాలు, నీటి ట్యాపుల నుంచి లీకేజీ కారణంగా నీరు నిల్వ ఉండటం వంటి సమస్యలను గుర్తించారు. ఈ నేపథ్యంలో కేఎఫ్‌సీ యాజమాన్యాలకు ప్రత్యేక నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇతర ఫుడ్ చైన్లలో పరిస్థితి…

మెక్‌డొనాల్డ్స్, డొమినోస్, సబ్‌వే రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తనిఖీల్లో తేలింది. అయితే వ్యర్థాలను తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలుగా వేరు చేసి నిర్వహించడంలో కొన్ని లోపాలు గుర్తించడంతో సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనల అమలుపై ఆయా సంస్థలకు కూడా నోటీసులు జారీ చేశారు.

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

నగరంలోని అన్ని ఆహార వ్యాపార సంస్థలు పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలు, సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని డాక్టర్ యువ అన్వేష్ హెచ్చరించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే పరిస్థితులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

తింటున్నది ఆహారమా.. అనారోగ్యమా..?