Crude Oil Transport | హార్మూజ్ జలసంధిలో మళ్లీ రాకపోకలకు మార్గం
Crude Oil Transport | హార్మూజ్ జలసంధిలో మళ్లీ రాకపోకలకు మార్గం
Crude Oil Transport | 62 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో సిద్ధమైన సూపర్ ట్యాంకర్లు
భారత్‌కు ఇంధన భద్రతపై ఎస్ అండ్ పీ హెచ్చరిక
చమురు ధరలు తగ్గినా దీర్ఘకాల వ్యూహం అవసరం
Crude Oil Transport | టెహ్రాన్: ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో త్వరలోనే హార్మూజ్ జలసంధిలో రవాణా కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు ప్రారంభించడంతో హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. అప్పటి నుంచి వందలాది ఆయిల్ ట్యాంకర్లు అక్కడే చిక్కుకుపోయాయి.
ప్రస్తుతం హార్మూజ్‌లో వందలాది ట్యాంకర్లలో ప్రధానంగా 31 సూపర్ ట్యాంకర్లు ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి ఈ ట్యాంకర్లు 62 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు రవాణా చేయనున్నాయి. వచ్చే నెల నాటికి హార్మూజ్ జలసంధిలో రాకపోకలు పూర్తిగా ప్రారంభం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఇవి ప్రారంభమైతే ఈ సూపర్ ట్యాంకర్లు అక్కడి నుంచి బయలుదేరుతాయి.
ప్రధానంగా ఇవి ఆసియా దేశాల్లోని రిఫైనరీలకు ముడి చమురును తీసుకురానున్నాయి. ఈ ట్యాంకర్లలో కొన్ని భారత్‌కు, మరికొన్ని తూర్పు ఆసియా దేశాలకు చేరుకుంటాయి. ఇవి భారత్ చేరేందుకు ఒక వారం, తూర్పు ఆసియా దేశాలకు చేరేందుకు మూడు వారాల సమయం పడుతుంది. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ, కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి పర్షియన్ గల్ఫ్ విక్రేతలు హార్మూజ్ నుంచి తమ చమురును తరలిస్తున్నాయి. శాంతి ఒప్పందం కుదరడంతో ఇరాక్ ముడి చమురు ఉత్పత్తిని పెంచుతోంది.
చమురు దిగుమతులను వైవిధ్యపరచాలి : ఎస్ అండ్ పీ
పశ్చిమాసియా సంక్షోభం ఇంధన భద్రతను కేవలం కొనుగోలు సమస్యగా పరిగణించకూడదనే విషయాన్ని భారత్‌కు గుర్తు చేసిందని ప్రముఖ పరిశోధనా సంస్థ ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ గురువారం విడుదల చేసిన నివేదికలో అభిప్రాయపడింది. చమురు దిగుమతులను వైవిధ్యపరచాల్సిన అవసరాన్ని, నిల్వలను భారీగా పెంచుకోవాల్సిన అవసరాన్ని, ఇన్వెంటరీ బఫర్ల రూపంలో దేశానికి మెరుగైన ప్రత్యామ్నాయాలు అవసరమని కూడా ఇది గుర్తు చేసిందని తెలిపింది.
• జలసంధిలో ఉన్న 31 సూపర్ ట్యాంకర్లు
• వాటిలో 62 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు
• ఒప్పందంతో తగ్గుతున్న ధరలు
ఎల్‌ఎన్‌జీతో పాటు, ముడి చమురుపై గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాలు భారత్‌కు అవసరమని ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ తెలిపింది. భారత్ తీసుకున్న సంక్షోభ నివారణ చర్యలు స్వల్పకాలానికి పరిమితమైనవని, దీర్ఘకాలం సంక్షోభం కొనసాగితే ఈ చర్యలు సరిపోవని పేర్కొంది. ముఖ్యంగా సంవత్సరాంతం వరకు తగినంత ముడి చమురు సరఫరాలను సురక్షితం చేసుకోవడంలో ఈ వ్యూహం సరిపోదని తెలిపింది.
తక్కువ డిమాండ్ ఉండే రుతుపవన కాలంలో నిల్వల వినియోగాన్ని తగ్గించుకోవడం ద్వారా సహాయపడవచ్చని, అయితే నాలుగో త్రైమాసికంలో పండుగ సీజన్‌లో పెరిగే ఇంధన డిమాండ్‌కు కూడా భారత్ సిద్ధంగా ఉండాలని సూచించింది. హార్మూజ్ జలసంధి ద్వారా రవాణా తిరిగి ప్రారంభమైనప్పటికీ, ముడి చమురు ప్రవాహాలు సాధారణ స్థితికి వచ్చేందుకు మరికొంత సమయం పడుతుందని నివేదిక స్పష్టం చేసింది.
ఒప్పందంతో అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 77 డాలర్లుగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఇది 70-72 డాలర్ల స్థాయికి, మరో నాలుగైదు నెలల్లో 65-68 డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. భారత్ తన అవసరాల్లో 90 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతున్నందున, ఈ అంతరాయం ముడి చమురు లభ్యతనే కాకుండా, శుద్ధి చేసిన ఉత్పత్తుల ఎగుమతులపై కూడా ప్రభావం చూపిందని తెలిపింది.
ఈ సంక్షోభం భారత్‌లో ఉన్న బలహీనతను బయటపెట్టిందని పేర్కొంది. ముడి చమురు వైవిధ్యీకరణ ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఇవి సరిపోవని, దిగుమతులపై ఎక్కువ ఆధారపడటం ఇంధన భద్రతకు దెబ్బ అని నివేదిక పేర్కొంది. హార్మూజ్ అంతరాయం కారణంగా రోజుకు 15 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా నిలిచిపోయింది. దీని వల్ల భారత రిఫైనరీలకు 20 శాతం సరఫరాలు తగ్గాయి. ఇతర దేశాల నుంచి ముడి చమురు కొనుగోళ్లకు భారత్ ప్రయత్నించిందని తెలిపింది.
ప్రపంచవ్యాప్త అంతరాయాల ప్రభావంతో దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు, రవాణా ఖర్చులు గణనీయంగా పెరగడంతో విద్యుత్ ధరలు కూడా పెరిగాయని తెలిపింది.
