Revanth Reddy | పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట…
- 16 కోట్ల మొక్కల లక్ష్యంతో వనమహోత్సవం ప్రారంభం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో పచ్చదనాన్ని మరింత పెంచి పర్యావరణ పరిరక్షణకు ఊతమిచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్క్‌లో ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 16 కోట్ల మొక్కలు నాటే మహత్తర లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గుర్రంగూడ ఎకో పార్క్‌లో నాగలింగం మొక్కను నాటిన సీఎం, పచ్చదనం పెంపొందించడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. వనమహోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా మార్చాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా మొత్తం రూ.35.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.
గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ.17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించగా, మరో రూ.17.66 కోట్ల విలువైన అర్బన్ పార్కులు, ఎకో పార్కులు, వన్యప్రాణి సంరక్షణ, జూ ఆధునీకరణ, నివాస భవనాలు, పర్యావరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మెదక్, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట, భూపాలపల్లి, సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గుర్రంగూడ ఎకో పార్క్‌లో ఏర్పాటు చేసిన రోబోటిక్ ఏనుగును సీఎం ప్రారంభించి పరిశీలించారు.
