జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి పై జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న టీజీ24బి9237 నెంబర్ గల ఎర్టిగా కారులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తున్నారు. తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో గోవర్ధనగిరి గ్రామం దర్గా సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్క కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

మృతి చెందిన వారిలో ఎండి అసద్ (26), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, అఫ్సా హబీబ్ (27) బీడీఎస్ వైద్యురాలుగా గుర్తించారు. వీరు వరంగల్‌లోని నయీంనగర్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన రహముద్దీన్ ఖాన్ (డ్రైవర్), షాహీన్ బేగం, ఇలేషా, రేష్మాలను వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. నరేష్ తెలిపారు.