పర్యావరణాన్ని కాపాడుటకు ప్రతి ఒక్కరు పాటుపడాలి..
నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు పిలుపునిచ్చారు.
శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారులతో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి ఆదేశాల మేరకు కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారులకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. దుకాణాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి, బట్ట సంచులను ప్రోత్సహించాలని కోరారు.
ప్లాస్టిక్ నిషేధ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, కిరాణా దుకాణాల యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు.
