Ocean Inspiration | సాగర స్ఫూర్తి.. సముద్రం నుండి జీవన పాఠాలు
Ocean Inspiration | సాగర స్ఫూర్తి.. సముద్రం నుండి జీవన పాఠాలు
Ocean Inspiration | భగవద్గీతలో స్థితప్రజ్ఞత భావన
సముద్రం నేర్పే నిర్మల జీవన దృష్టి
కష్టసుఖాలలో సమభావం
అహంకారం లేని మహత్తర వ్యక్తిత్వం
Ocean Inspiration | “అపూర్వమాణం అచల ప్రతిష్ఠం సముద్రమాపః ప్రవిశంతి. యద్వత్ / తద్వత్కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిమాప్నోతి నకామ కామీ”. ఎల్ల ప్పుడూ నీటితో నిండుగా ఉండి, నిశ్చలంగా ఉండే సముద్రంలోకి ఎన్నో నదు లు ఎలా ప్రవేశిస్తూ ఉంటాయో, అలాగే ఎన్నో ప్రాపంచిక విషయాలు మనసులో ప్రవేశిస్తున్నా వాటిపట్ల నిర్లిప్తంగా ఉండగలిగిన వాడే స్థితప్రజ్ఞుడు. అతడే జ్ఞాని. ప్రశాంతంగా జీవితం సాగించగల వివేకి అంటుంది భగవద్గీత.
సముద్రంలోకి నదులు నీటినేకాక ఎన్నో వ్యర్థాలను కూడా
మోసుకొని తెస్తూ ఉంటాయి. అయితే ఆ మలినాలను సముద్రం ఎప్పటికప్పుడు తన కెరటాలనే హస్తాలతో తీరానికి తరలింపచేసి తనను తాను శుభ్రంగా, నిర్మలంగా ఉంచుకొంటుంది. అలానే దురాలోచనలు, అజ్ఞాన భావనలు మొదలైన మలినాలను మనలో చేరనీయక మన మనసులను నిర్మలంగా ఉంచుకోవాలని సముద్రం సూచిస్తూంది.
వర్షాకాలంలో తనలోకి నదుల ద్వారా చేరుతున్న వరదనీటి వల్ల పొంగిపోవడం కానీ, ఎండా కాలంలో నీరు చేరక పోవడం వల్ల క్రుంగిపోవడం కానీ చేయని సాగరం కష్ట సుఖాలలో మనిషి పొంగు క్రుంగులు లేకుండా సమభావంతో వర్తించాలని మనకు బోధిస్తుంది. “సంపదలు ఉన్నా అహంకరింపక, సరిహద్దెన్నడూ అతిక్రమింపక, ఆటుపోట్లకు తట్టుకొని నిలవడం” సముద్రం నుండి మనం నేర్వ వలసిన గొప్ప పాఠం.
రత్నాకరుడని సముద్రునికి పేరు. ఎన్నో విలువైన రత్నాలు, ముత్యాలు, పగడాలు వంటి సంపదలు, ఉప్పు వంటి అందరికీ నిత్యావసరమైన ఖనిజసంపదలకు ఆలవాలమైనా వాటిని చూచుకొని సముద్రం గర్వించదు. ఎప్పుడూ తన హద్దును, పరిమితిని దాటి ప్రవర్తించదు. ఆటుపోట్లు తనలో అలజడి సృష్టిస్తున్నా గాంభీర్యాన్ని, స్థిరత్వాన్ని కోల్పోదు. ఇటువంటి వ్యక్తిత్వాన్ని అలవరచుకొంటే జీవితం పాలసముద్రంలో పూలపాన్పు వలె ఆనందంగా, ప్రశాంతంగా సాగిపోతుందనడంలో సందేహం లేదు.
–డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
