సాదా బైనామాలను త్వరితగతిన పూర్తి చేయాలి..
సాదా బైనామాలను త్వరితగతిన పూర్తి చేయాలి..
- జిల్లా అదనపు కలెక్టర్ రాములు
జన్నారం, ఆంధ్రప్రభ : సాదా బైనామా,భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం తహసిల్దార్ కార్యాలయాన్ని గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా కార్యాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టాదారుతో పని లేకుండా సాదా బైనామా కింద గతంలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి మోకాపై ఉన్నట్లయితే వాటి నివేదికలు వెంటనే తయారుచేసి జిల్లా కలెక్టర్ కు పంపించాలని ఆయన సూచించారు.
భూభారతి దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి పూర్తి చేయాలని ఆయన తెలిపారు.ఈనెల 25 నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.కార్యాలయానికి వచ్చే ప్రజల పట్ల స్నేహపూర్వకంగా అధికారులు,ఉద్యోగులు మెలగాలని ఆయన సూచించారు. ఉద్యోగులందరూ సమయపాలన తప్పకుండా పాటించాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ బక్కయ్య, ఎమ్మారై వెంకటేశం, సీనియర్ అసిస్టెంట్ సీదార్ల ఉదయ్ కుమార్,పలువురు జీపీఓలు పాల్గొన్నారు.
