E85 Fuel | చౌకగా కనిపించే E85.. అసలు లెక్క తెలుసా?
E85 Fuel | చౌకగా కనిపించే E85.. అసలు లెక్క తెలుసా?
- అసలు ఏంటీ E85 ఇంధనం?
- E85 Fuel: లీటర్‌కు రూ.20 తక్కువే.. కానీ ట్విస్ట్ ఇక్కడే!
- ఎథనాల్‌తో చమురు దిగుమతులు తగ్గుతాయా?
ఆంధ్రప్రభ : E85 Fuel | వెస్ట్ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్న వేళ, దిగుమతి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగంపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్ మిశ్రమం (E20) లక్ష్యాన్ని గడువుకంటే ముందే సాధించిన భారత్.. ఇప్పుడు మరో ముందడుగు వేస్తూ E85 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికను అమలు చేస్తోంది.
ఈ క్రమంలో గత వారం ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో E85 ఇంధనాన్ని అధికారికంగా ప్రారంభించారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 500 పెట్రోల్ బంకుల్లో ఈ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం, 2027 చివరి నాటికి 5,000 రిటైల్ అవుట్‌లెట్లకు విస్తరించాలని యోచిస్తోంది.
అయితే, కొత్తగా అందుబాటులోకి వస్తున్న E85 ఇంధనంపై వాహనదారుల్లో మాత్రం మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఇది సాధారణ వాహనాలకు అనుకూలమా? ఇంజిన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మైలేజీ తగ్గిపోతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న చాలా వాహనాలు E20 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకుని తయారయ్యాయి. అలాంటి వాహనాల్లో E85 ఇంధనం వినియోగిస్తే ఫ్యూయల్ సిస్టమ్‌లో తుప్పు పట్టడం, ఇంజిన్ పనితీరు దెబ్బతినడం, దీర్ఘకాలంలో ఇంజిన్‌కు నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు, పెట్రోల్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం, రైతులకు ఎథనాల్ ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం E85 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. మరి వాహనదారులు ఆందోళన చెందుతున్నట్టు.. ఈ ఇంధనం అందరికీ ఉపయోగపడుతుందా? సాధారణ బైక్‌లు, కార్లలో వాడొచ్చా? ధర నిజంగా తక్కువేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు వాహనదారుల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అసలు ఏంటీ E85?
భారత్‌లో ప్రస్తుతం పెట్రోల్‌లో 20 శాతం వరకు ఎథనాల్ కలిపిన E20 ఇంధనం వినియోగంలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా E85 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో 85 శాతం ఎథనాల్, 15 శాతం పెట్రోల్ ఉంటుంది. అలాగే E100 ఇంధనంలో 93 నుంచి 95 శాతం వరకు ఎథనాల్ ఉంటుంది. ఎథనాల్ అనేది ప్రధానంగా చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారయ్యే బయో ఫ్యూయల్. పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎథనాల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

అయితే E85, E100 ఇంధనాలు సాధారణ వాహనాల కోసం కావు. వీటిని వినియోగించాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికిల్స్ (FFVs) అవసరం. E20, E85, E100 వంటి భిన్న ఎథనాల్ మిశ్రమాలను గుర్తించి వాటికి అనుగుణంగా పనిచేసేలా ఈ వాహనాలను ప్రత్యేకంగా రూపొందిస్తారు. వీటిలో ప్రత్యేక సెన్సార్లు, ఇంజిన్ కంట్రో ల్ సాఫ్ట్‌వేర్ ఉంటాయి. ట్యాంక్‌లో ఉన్న ఇంధనంలో ఎథనాల్ శాతాన్ని గుర్తించి, దానికి అనుగుణంగా ఇంజిన్ పనితీరును స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తాయి. అధిక ఎథనాల్ కారణంగా ఫ్యూయల్ సిస్టమ్‌కు తుప్పు పట్టకుండా ప్రత్యేక భాగాలను కూడా అమర్చుతారు.
సాధారణ బైక్‌లు, కార్లలో E85 పోయవచ్చా?
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న E20 అనుకూల వాహనాల్లో E85 ఇంధనం వినియోగించడం సురక్షితం కాదు. E85లో ఎథనాల్ శాతం చాలా ఎక్కువగా ఉండటంతో సాధారణ ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్‌లు దానిని తట్టుకునేలా రూపొందించబడలేదు. దీంతో ఇంజిన్ పనితీరు తగ్గడం, ఫ్యూయల్ సిస్టమ్‌లో తుప్పు పట్టడం, దీర్ఘకాలంలో ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఉంది.
భారత్ స్టేజ్-6 (ఫేజ్-2) నిబంధనల ప్రకారం 2023 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలు E20 ఇంధనానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, E85 వినియోగానికి మాత్రం ప్రత్యేక ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ తప్పనిసరి. అందువల్ల వాహన తయారీ సంస్థ అనుమతి లేకుండా సాధారణ బైక్ లేదా కారులో E85 నింపడం మంచిది కాదు.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు ఇవే..
E85 ఇంధనం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, దానిని ఉపయోగించగల ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఇటువంటి వాహనాల సంఖ్య చాలా పరిమితంగానే ఉన్నప్పటికీ, కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు ఇప్పటికే తమ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడళ్లను పరిచయం చేశాయి.
ద్విచక్ర వాహనాల్లో…
Hero MotoCorp భారతదేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌గా హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ ప్రారంభ ధర సుమారు రూ.82,710 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
అలాగే హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.72,792 (ఎక్స్-షోరూమ్). ఈ రెండు మోడళ్లు 97.2 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తాయి. E20 నుంచి E85 వరకు వివిధ ఎథనాల్ మిశ్రమాలను వినియోగించేలా వీటిని రూపొందించారు.
కార్ల విభాగంలో…
మారుతీ సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కాన్సెప్ట్‌ను ఇప్పటికే ప్రదర్శించింది. దీనిని భారతదేశపు తొలి మాస్ మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కార్లలో ఒకటిగా భావిస్తున్నారు. ఈ వాహనం అధిక ఎథనాల్ మిశ్రమాలతో కూడా పనిచేసేలా అభివృద్ధి చేయబడింది.
కేంద్ర ప్రభుత్వం E85 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా విస్తరించే చర్యలు ప్రారంభించినప్పటికీ, ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల మార్కెట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ప్రస్తుతం కొద్దిమంది వినియోగదారులకే ఈ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో మరిన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు, బైక్‌లను మార్కెట్లోకి తీసుకురావచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో E85 ఇంధన వినియోగం కూడా దశలవారీగా పెరిగే అవకాశం ఉంది.
లీటర్‌కు రూ.20 తక్కువే… కానీ అసలు లెక్క వేరే!
E85 ఇంధనం గురించి విన్న వెంటనే చాలామందికి ముందుగా కనిపించేది దాని ధరే. ప్రస్తుతం ఢిల్లీలో E20 పెట్రోల్ ధర లీటర్‌కు రూ.102.12 ఉండగా, E85 ధర రూ.82.12గా నిర్ణయించారు. అంటే లీటర్‌కు ఏకంగా రూ.20 తక్కువ. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఇంధనం ఎంత ధరకు దొరుకుతోంది అనేదానికంటే, ఆ ఇంధనంతో వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందనేదే ముఖ్యమైన అంశం.

ఎథనాల్‌లో పెట్రోల్‌తో పోలిస్తే శక్తి ఉత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల E85 ఇంధనంతో నడిచే వాహనం అదే దూరం ప్రయాణించాలంటే పెట్రోల్‌తో పోలిస్తే ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి వస్తుంది. ఉదాహరణకు, E20 పెట్రోల్‌పై ఒక వాహనం లీటర్‌కు 15 కిలోమీటర్లు మైలేజీ ఇస్తే, అదే తరహా ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనం E85పై సుమారు 10.5 నుంచి 11.25 కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది.
ఈ లెక్కన చూస్తే E20 పెట్రోల్‌పై కిలోమీటర్‌కు సుమారు రూ.6.81 ఖర్చు అవుతుంది. అదే E85పై కిలోమీటర్‌కు రూ.7.30 నుంచి రూ.7.82 వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. అంటే లీటర్ ధర తక్కువగా కనిపించినప్పటికీ, మైలేజీ తగ్గిపోవడం వల్ల వాస్తవ ప్రయాణ వ్యయం కొన్ని సందర్భాల్లో పెట్రోల్ కంటే ఎక్కువ కావచ్చు. అందుకే E85 ఇంధనం చౌకగా దొరుకుతున్నా, అది ప్రతి వాహనదారుడికి వెంటనే ఆర్థిక లాభం తెస్తుందని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే దేశ స్థాయిలో చమురు దిగుమతులు తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రోత్సహిస్తోంది.
కేంద్రం ఎందుకు ప్రోత్సహిస్తోంది?
భారత్‌లో పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమాన్ని పెంచడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందుకు ప్రధాన కారణం విదేశీ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే. ప్రస్తుతం వెస్ట్ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

2014లో కేవలం 1.53 శాతంగా ఉన్న ఎథనాల్ మిశ్రమం ప్రస్తుతం 20 శాతానికి చేరుకుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. దీంతో దేశానికి సుమారు రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా కావడంతో పాటు, 302 లక్షల మెట్రిక్ టన్నుల మేర ముడి చమురు దిగుమతులు తగ్గినట్లు ప్రభుత్వం చెబుతోంది.
అంతేకాకుండా 2070 నాటికి భారత్ నిర్దేశించుకున్న ‘నెట్-జీరో కార్బన్ ఉద్గారాల’ లక్ష్య సాధనలో కూడా ఎథనాల్ ఆధారిత ఇంధనాలు కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తోంది. పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్ వినియోగం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గే అవకాశం ఉండటంతో, పర్యావరణ హిత ఇంధనంగా దీనిని ప్రోత్సహిస్తోంది.
మరి సామాన్య వాహనదారుడికి లాభమా?
ప్రస్తుతం ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పాలంటే.. తక్షణ ప్రయోజనం పరిమితంగానే ఉంది. E85 ఇంధనాన్ని వినియోగించగల ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలు భారత మార్కెట్లో ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి వాహనాల సంఖ్య ఇప్పటికీ చాలా తక్కువ. కాబట్టి ప్రస్తుతం E85 వల్ల ప్రత్యక్ష లాభం పొందగలిగేది ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల యజమానులే.
అలాగే E85 ధర లీటర్‌కు తక్కువగా ఉన్నప్పటికీ, మైలేజీ తగ్గే అవకాశం ఉండటంతో వాహనదారుడి రోజువారీ ప్రయాణ ఖర్చు తప్పనిసరిగా తగ్గిపోతుందని చెప్పలేం. అందువల్ల సాధారణ వినియోగదారుడి దృష్టిలో చూస్తే E85 ఇప్పటికిప్పుడు పెద్ద ఆర్థిక ప్రయోజనం అందించే ఇంధనంగా కనిపించకపోవచ్చు.
అయితే దేశ స్థాయిలో చూస్తే చమురు దిగుమతుల భారం తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, చెరకు రైతులు, ఎథనాల్ ఉత్పత్తిదారులకు కొత్త మార్కెట్ కల్పించడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం వంటి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం E85 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది.
AI Data Center | భారత్‌లో భారీ AI పెట్టుబడి..
E85 Fuel E85 Fuel E85 Fuel E85 Fuel E85 Fuel E85 Fuel E85 Fuel
