India A team | అఫ్గాన్‌పై భారత్-ఏ బ్యాటింగ్ విధ్వంసం

India A team | అఫ్గాన్‌పై భారత్-ఏ బ్యాటింగ్ విధ్వంసం

India A team | వైభవ్ మెరుపులు.. ప్రభ్‌సిమ్రన్, తిలక్, గైక్వాడ్ అర్ధసెంచరీలు
349 పరుగుల భారీ స్కోరుతో భారత్-ఏ సవాల్
అఫ్గానిస్తాన్-ఏకు 350 పరుగుల లక్ష్యం

ఆంధ్ర్రప్ర‌భ వెబ్‌డెస్క్ : శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ జట్టు మరోసారి తన బ్యాటింగ్ బలాన్ని చాటుకుంది. అఫ్గానిస్తాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో యువ బ్యాటర్లు చెలరేగి ఆడటంతో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ల దూకుడు, మధ్యవరుస నిలకడ, కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్-ఏ నిర్ణీత ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు సాధించి ప్రత్యర్థి ముందు కఠిన లక్ష్యాన్ని ఉంచింది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్-ఏ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్-ఏకు ఓపెనర్లు ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్‌, వైభ‌వ్ సూర్య‌వంశీ అద్భుత ఆరంభాన్ని అందించారు.

వైభవ్ సూర్యవంశీ మొదటి నుంచే దూకుడు ప్రదర్శిస్తూ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 44 పరుగులు చేశాడు. తృటిలో హాఫ్‌ సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఓపికగా ఆడుతూ 69 బంతుల్లో 84 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు.

వన్‌డౌన్‌లో వచ్చిన ప్రియాంశ్ ఆర్య (8) నిరాశపరిచినా, ఆ తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను చక్కగా నడిపించాడు. 80 బంతుల్లో 66 పరుగులు చేసిన గైక్వాడ్ మరోసారి తన క్లాస్‌ను చూపించాడు. కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 73 బంతుల్లో 66 పరుగులు చేసి మధ్యవరుసలో జట్టుకు అండగా నిలిచాడు. దీంతో భారత్-ఏ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది.

చివర్లో సుయాష్ శ‌ర్మ స్థానంలో ఆడిన సూయాన్ష్ షెడ్గే 40 పరుగులతో వేగంగా ఆడి స్కోరును మరింత పెంచాడు. అనుకుల్ రాయ్ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆయుష్ బదోని ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా, భారత్-ఏ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.

అఫ్గానిస్తాన్-ఏ బౌలర్లలో అబ్దుల్లా అహ్మ‌ద్ జై అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫార్మ‌నుల్లా ష‌ఫీ మూడు వికెట్లు తీసుకోగా, కెప్టెన్ ఇమ్రాన్ మీర్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. భారీ స్కోరుతో ఉత్సాహంగా ఉన్న భారత్-ఏ జట్టు, బౌలింగ్‌లోనూ అదే జోరు కొనసాగించి విజయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.