ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను పరిశీలిస్తాం..

ఉద్యోగ సంఘాల ప్రతిపాదనలను పరిశీలిస్తాం..

కలెక్టర్ జి. రాజకుమారి

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలోని ఉద్యోగుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని జి. రాజకుమారి తెలిపారు.

జిల్లాలోని 30 గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన స్టాఫ్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలు, డిమాండ్లు, సూచనలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఉద్యోగులు ప్రధానంగా ఐఆర్, డీఏ, పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 60 సంవత్సరాలకు పెంచడం వంటి అంశాలను ప్రస్తావించారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సెలవుల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. మున్సిపల్, జెడ్పీ ఉద్యోగులు జెడ్పీఎఫ్ రుణాల మంజూరులో జరుగుతున్న జాప్యాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కార్యాలయాల నిర్వహణకు అవసరమైన స్టేషనరీ, కంప్యూటర్లు, ప్రింటర్లు తదితర వసతుల కోసం తగిన బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.

విద్యార్థులకు అందించే పోషకాహార పదార్థాల సకాల సరఫరా, పాత పాఠశాల భవనాల కూల్చివేత, నష్టపరిహారం చెల్లింపుల అంశాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

జీజీహెచ్ ఆసుపత్రిలో మెడికల్ బిల్లుల స్క్రూటినీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరారు. సమావేశంలో మొత్తం 124 సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

పెన్షనర్ల గోడును ప్రభుత్వానికి వినిపించండి

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సమస్యలను కూడా కలెక్టర్‌కు వివరించారు.

పెన్షనర్లకు వయోపరిమితి ఆధారంగా అందజేస్తున్న అదనపు క్వాంటం పెన్షన్‌ను 7 శాతం నుంచి 10 శాతానికి, 10 శాతం నుంచి 15 శాతానికి, 15 శాతం నుంచి 20 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు.

పే రివిజన్ కమిషన్ నివేదిక మేరకు 11వ పీఆర్సీ పే ఫిక్సేషన్‌ను తొలి దశలో అమలు చేయాలని కోరారు. 2026 సంవత్సరానికి సంబంధించిన 10 శాతం డీఆర్‌ను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

పెండింగ్‌లో ఉన్న డీఆర్ అరియర్స్‌ను సంబంధిత తేదీల వారీగా వెంటనే చెల్లించాలని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావలసిన బకాయిలను కూడా త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

పెన్షనర్ల కమ్యూటేషన్ బిల్లులను ఆఫ్‌లైన్ విధానంలో కాకుండా ఆన్‌లైన్ ద్వారా సమర్పించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరాన్ని సవివరంగా వివరించారు.

కార్యక్రమంలో జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply