Thorrur నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు

Thorrur నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక

తొర్రూరు (Thorrur), ఆంధ్రప్రభ:

నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ గడీల శ్రీనివాస్, ఎంపీడీవో కూస వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం విత్తన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ అధికారి (ఏవో) రామనర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసిల్దార్, ఎంపీడీవో మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విత్తనాలు, ఎరువుల దుకాణంలో ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రసీదు ఇవ్వాలని ఆదేశించారు.

గడువు ముగిసిన విత్తనాలను విక్రయించినా, లైసెన్స్ లేదా రెన్యువల్ లేకుండా వ్యాపారం నిర్వహించినా సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎస్సై మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పత్తి విత్తనాల ప్యాకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లూజ్‌గా విక్రయించవద్దని డీలర్లకు సూచించారు. రాత్రి వేళల్లో ఎవరైనా అక్రమంగా విత్తనాల విక్రయాలు జరిపితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు భద్రపరచుకోవాలని, అనుమానాస్పద విత్తనాల విక్రయాలపై వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

ఈ సమావేశంలో ఏఈవోలు భరత్ చంద్ర, వినయ్ వర్మ, విత్తనాలు, ఎరువుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply