BCCI | ఆశపెట్టి అవకాశం లాక్కుంటారా
BCCI | ఆశపెట్టి అవకాశం లాక్కుంటారా
- బీసీసీఐపై ఫ్యాన్స్ గరం గరం..
- సిరాజ్‌కు రెస్ట్.. ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లకు దూరం!
- స్టార్ పేసర్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు బీసీసీఐ విశ్రాంతి కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయలేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. సిరాజ్ స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంది. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్.. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. అయితే ఈ రెండు సిరీస్‌లకు సిరాజ్ అందుబాటులో ఉండడు.
అయితే, సిరాజ్ పేరు జట్టులో లేకపోవడంతో మొదట హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేశారు. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసినా, మళ్లీ అవకాశాన్ని లాక్కున్నారా? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనిపించాయి. అయితే బీసీసీఐ అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత అసలు విషయం బయటపడింది.
ఎందుకు రెస్ట్ ఇచ్చారు?
ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో సిరాజ్ ఆడాడు. అంతకుముందు పూర్తి ఐపీఎల్ సీజన్‌లోనూ గుజరాత్ టైటాన్స్ తరఫున కీలక పాత్ర పోషించాడు. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు భారత్ తరఫున అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసిన పేసర్ కూడా సిరాజే. గత ఏడాదిన్నర కాలంలో అన్ని ఫార్మాట్లలో కలిపి 374.3 ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్‌పై భారీ వర్క్‌లోడ్ పడింది. దీంతో రాబోయే సుదీర్ఘ అంతర్జాతీయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ మెడికల్ టీమ్, టీమ్ మేనేజ్‌మెంట్ కలిసి నిర్ణయించినట్లు బోర్డు తెలిపింది.
ప్రసిద్ధ్‌కు ఛాన్స్
సిరాజ్ స్థానంలో కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం దక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ అనుభవం లేకపోయినా, భారత్ తరఫున ఆడిన అవకాశాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించాడు. ఇప్పటివరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్రసిద్ధ్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ఐపీఎల్‌లో కూడా అతడు మంచి ప్రదర్శన కనబర్చాడు. వేగం, బౌన్స్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సామర్థ్యం అతడికి ఉంది. దీంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌ల్లో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని ప్రసిద్ధ్ భావిస్తున్నాడు.
సిరాజ్ రికార్డు వర్క్‌లోడ్
హైదరాబాద్‌కు చెందిన సిరాజ్ గత కొంతకాలంగా టీమిండియా బౌలింగ్ విభాగంలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. 2025 నుంచి భారత్ ఆడిన 11 టెస్టుల్లోనూ అతడు జట్టులో ఉన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున 17 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు పడగొట్టాడు. పేసర్లపై పడే శారీరక ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని ఈ విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఇది పూర్తిగా ఫిట్‌నెస్, రికవరీ కోసమే తీసుకున్న నిర్ణయమని బీసీసీఐ అని పేర్కొంది.
ఇక పూర్తిగా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తీసుకున్న నిర్ణయమని తెలిసి అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. గత ఏడాదిన్నర కాలంగా అన్ని ఫార్మాట్లలో నిరంతరం ఆడుతున్న సిరాజ్‌పై భారీ ఒత్తిడి పడటంతోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టంతా సిరాజ్ త్వరగా ఫ్రెష్‌గా తిరిగి వచ్చి టీమిండియా పేస్ అటాక్‌ను నడిపించాలనే దానిపైనే ఉంది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు భారత జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
