TrainAccident I రైలుకు ఎదురు నిలబడి ఆత్మహత్య
TrainAccident I రైలుకు ఎదురు నిలబడి ఆత్మహత్య
- ట్రైన్ ఇంజన్‌కు వేలాడుతూ పది కిలోమీటర్లకు పైగా ముందుకు వచ్చిన మృతదేహం
- నాయుడుపేట వద్ద ట్రైన్ నిలిపి మృతదేహాన్ని తీసిన సిబ్బంది
- చిలమత్తూరు వాసిగా రైల్వే పోలీసులు గుర్తింపు
నాయుడుపేట, ఆంధ్రప్రభ:
ఉదయం ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన కొడుకు… సాయంత్రానికి శవంగా తిరిగొచ్చాడు. తల్లిదండ్రుల ఆశలు, కుటుంబం కలలు క్షణాల్లో ఛిద్రమయ్యాయి. జీవితంలో ఇంకా ఎన్నో మైలురాళ్లు చేరాల్సిన 25 ఏళ్ల యువకుడు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా విషాదాన్ని నింపింది. రైలు ఇంజిన్‌కు చిక్కుకుని పది కిలోమీటర్లకు పైగా మృతదేహం వేలాడుతూ వెళ్లిన హృదయ విదారక ఘటన చూసిన వారిని కన్నీళ్లు పెట్టించింది. నాయుడుపేట సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన కుటుంబ సభ్యులను, గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
వివరాల్లోకి వెళ్తే.. నాయుడుపేట మండలం చిలమత్తూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు–జయమ్మ దంపతుల చిన్న కుమారుడు రాయపు మమాకర్ (25) ఐటీఐ పూర్తి చేసి అపాచీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
రైలుకు ఎదురు నిలబడి..
ఏమైందో ఏమో తెలియదు కానీ.. సోమవారం రైలుకు ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నాడు. గయా నుంచి చెన్నై వెళ్తున్న రైలు నాయుడుపేట మండలం పండ్లూరు సమీపానికి చేరుకున్న సమయంలో మమాకర్ రైల్వే ట్రాక్‌పైకి వచ్చి రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. వేగంగా వస్తున్న రైలు అతడిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే యువకుడు రైలు కింద పడిపోయి ఉంటాడని భావించిన లోకో పైలట్ రైలును ముందుకు నడిపించాడు. కానీ ఆ యువకుడి మృతదేహం ఇంజిన్ ముందు భాగానికి చిక్కుకుని అలాగే వేలాడుతూ ఉండిపోయింది. ప్రాణం లేని శరీరం వేగంగా దూసుకుపోతున్న రైలు ముందు కనిపించిన దృశ్యం చూసిన వారిని కలచివేసింది.
ఇంజిన్‌కు వేలాడుతూ..
నాయుడుపేట రైల్వే స్టేషన్ దాటి కొంతదూరం వెళ్లిన తర్వాత ఇంజిన్‌కు మృతదేహం వేలాడుతున్నట్లు గుర్తించిన రైల్వే సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. దీంతో విన్నమాల సమీపంలో రైలును నిలిపివేసి మృతదేహాన్ని బయటకు తీశారు. దాదాపు అరగంట పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీసి రైల్వే పోలీసులకు అప్పగించారు. అనంతరం రైలు చెన్నై వైపు బయలుదేరింది.
అయితే, ఆ సమయంలో రైల్లో ఉన్న ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాక అందరూ రైలు దిగిపోయి ఇంజిన్ ముందు భాగానికి పరుగులు తీశారు. మమాకర్ మృతదేహం ఇంజిన్‌కు చిక్కుకుని వేలాడుతుండటాన్ని చూసిన పలువురు కంటతడి పెట్టారు.
తల్లడిల్లిన తల్లిదండ్రులు..
చేతికి అందివచ్చిన కొడుకు ఇలా శవమై కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలా, వ్యక్తిగత సమస్యలా, ప్రేమ వ్యవహారమా అనే కోణాల్లో విచారణ సాగుతోంది.
అయితే కారణం ఏదైనా, జీవితంలో ఇంకా ఎన్నో మైలురాళ్లు చేరాల్సిన యువకుడు అర్ధాంతరంగా మాయమవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
