Bail Sanctioned | పోసానికి బెయిలొచ్చింది…

కర్నూల్: ఆదోని కేసులో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. నిన్న (సోమవారం) పోసానిని కస్టడీకి ఇవ్వాలనే పిటిషన్ కొట్టివేసిన జేఎఫ్సీఎం కోర్టు.. ఈ రోజు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఆదోని త్రీటౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ ఫిర్యాదుతో 2024 నవంబర్ 14న కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 353(1), 353(2), 353(సి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, విజయవాడ నుంచి పేటి వారెంట్ పై అరెస్టు చేశారు.


ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు పోసాని. బెయిల్ పిటిషన్పై సుదీర్ఘ వాదనల తరువాత నిన్న తీర్పు రిజర్వు చేశారు మేజిస్ట్రేట్. అయితే పోసానికి బెయిల్ పిటిషన్ను ప్రభుత్వ న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. పోసానిని మరింత విచారించాల్సి ఉందని, దూషణల వెనుక ఎవరు ఉన్నారో తేలాల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నిన్ననే కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన మేజిస్ట్రేట్.. ఈ రోజు బెయిల్ మంజూరు చేశారు.

దాంతో పోసాని కృష్ణమురళికి ఇప్పటివరకూ మూడు కేసుల్లో బెయిల్ లభించింది. నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి నిన్న బెయిల్ మంజూరైంది. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో నరసరావుపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు. పోసానిని హైదరాబాద్ లోని నివాసంలో అరెస్ట్ చేసి ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్ జిల్లా ఆదోనీ పీఎస్లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్ పిటిషన్ విచారణ దశలో ఉంది. కాగా అరెస్ట్ అయిన మూడు కేసుల‌లోనూ బెయిల్ మంజూరు కావ‌డంతో పోసాని రేపు విడుద‌య్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *