జింకల బారి నుంచి పంటలను కాపాడండి
జింకల బారి నుంచి పంటలను కాపాడండి
- కలెక్టర్‌కు ఊట్కూర్ రైతుల విజ్ఞప్తి
ఊట్కూర్, ఆంధ్రప్రభ:
జింకల బారి నుంచి పత్తి పంటలను రక్షించాలని ఊట్కూర్ మండల రైతులు నారాయణపేట జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంకను ప్రజావాణి కార్యక్రమంలో కలిసి సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది కురిసిన వర్షాలతో పత్తి సాగు చేపట్టామని, అయితే గుంపులుగా వస్తున్న జింకలు పంట మొక్కలను తినివేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని రైతులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఖరీఫ్ సీజన్‌లో పత్తి సాగు కోసం విత్తనాలు, ఎరువులు, భూమి దున్నకం తదితర పనుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేశామని, మొక్కల దశలోనే జింకలు పంటను నాశనం చేస్తుండటంతో తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదురవుతున్నాయని తెలిపారు. రాత్రి, పగలు తేడా లేకుండా జింకలు పొలాల్లోకి ప్రవేశించి పంటలను మేస్తున్నాయని వాపోయారు.
జింకల సమస్యను మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన విషయాన్ని రైతులు గుర్తు చేశారు. వెంటనే చర్యలు తీసుకుని జింకల బారి నుంచి పంటలను రక్షించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం అటవీశాఖ అధికారులకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు జనార్దన్ రెడ్డి, చిన్న వెంకట్ రెడ్డి, నర్సిములు, పెద్ద వెంకట్ రెడ్డి, సిద్ధరాములు, జములప్ప, సందప్ప, బాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
