పది సెంట్ల భూమి కోసం దారుణ హత్య

పది సెంట్ల భూమి కోసం దారుణ హత్య

భూమయ్యగారిపల్లిలో దారుణ ఘటన
ఆస్తి వివాదాలే కారణమా..?

చిలమత్తూరు, ఆంధ్రప్రభ : చిలమత్తూరు మండల పరిధిలోని మోరసనపల్లి భూమయ్యగారిపల్లి గ్రామంలో సోమవారం దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి రామకృష్ణప్పను శివప్ప అనే వ్యక్తి కొడవలితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. ఇదే ఘటనలో రామచంద్ర అనే వ్యక్తికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.గ్రామ ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, రీ-సర్వేలో భాగంగా పది సెంట్లు భూమికి సంబంధించిన ఆస్తి వివాదాల కారణంగా ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మాటామాటా పెరగడంతో శివప్ప ఆగ్రహంతో కొడవలితో దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

దాడి అనంతరం స్థానికులు వెంటనే స్పందించి ఇద్దరినీ చిలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రామకృష్ణప్ప అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. గాయపడిన రామచంద్రకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply