రామక్కపేటలో వీధికుక్కల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

రామక్కపేటలో వీధికుక్కల దాడి.. బాలుడికి తీవ్ర గాయాలు

దుబ్బాక రూరల్, ఆంధ్రప్రభ:
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సోమవారం వీధికుక్కల దాడి ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరాం విఘ్నేష్ అనే బాలుడు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఒక వీధికుక్క అతనిపై దాడి చేసింది.

కుక్క బాలుడిని విచక్షణారహితంగా కరవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కను అక్కడి నుంచి తరిమివేశారు. అనంతరం గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గ్రామంలో వీధికుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్లపై తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ సర్పంచ్, పాలకవర్గం, గ్రామ పంచాయతీ అధికారులు స్పందించాలని రామక్కపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply