ధాన్యం నిల్వలపై కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ..
ధాన్యం నిల్వలపై కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీ..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ మండలంలోని చందుబట్ల గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యం నిల్వలు, వాటి భద్రత, నిర్వహణ విధానాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా రైస్ మిల్లులో నిల్వ చేసిన వరి ధాన్యం వివరాలను సంబంధిత అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ధాన్యం నిల్వ చేసే గోదాముల సామర్థ్యం, తేమ శాతం, నాణ్యత పరిరక్షణ చర్యలు, రవాణా ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలపై అధికారులు ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యానికి ఎలాంటి నష్టం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల నుంచి ధాన్యం దిగుమతి వేగవంతం చేసి రైతులు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని, డేటా నమోదు ప్రక్రియలో ఆలస్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ ధాన్యం నిల్వ కేంద్రాలు, గోదాముల వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. రైతుల కష్టార్జిత పంట భద్రంగా నిల్వ ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ తనిఖీలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నరసింహారావు, డీఎం సివిల్ సప్లై రాజేందర్, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లు ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
