Telangana Health Survey | తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్లు అత్యధికం
Telangana Health Survey | తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్లు అత్యధికం
Telangana Health Survey | తాజా సర్వేలో రెట్టింపు
ప్రైవేటు ఆసుపత్రుల్లో 83.9 శాతం సిజేరియన్లు
Telangana Health Survey | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రతి పది మందిలో ఆరుగురికి సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నట్లు జాతీయ ఆరోగ్య శాఖ సర్వేలో తేలడం ఆందోళన కలిగిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించడంతో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గింది. వాస్తవానికి అనేక ఆరోగ్య సూచీల్లో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరుస్తున్నా, సీ-సెక్షన్ ఆపరేషన్లు మాత్రం కలవరపరుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తెలంగాణలోనే అత్యధికంగా నమోదవుతోంది. ఇక్కడ జరుగుతున్న పది ప్రసవాల్లో ఆరుగురికి ఆపరేషన్ జరుగుతున్నట్లు ఇటీవల జాతీయ ఆరోగ్య శాఖ జరిపిన సర్వే ఫలితాల ద్వారా వెల్లడైంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆ గణాంకాలను విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 98.8 శాతం ప్రసూతి కేసులు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని, ఇది జాతీయ సగటు 90.6 శాతం కన్నా ఎక్కువేనని, కానీ 62.2 శాతం డెలివరీలు మాత్రం సిజేరియన్ ద్వారా జరుగుతున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇది జాతీయ సగటు 27.2 శాతం కన్నా రెట్టింపు అని ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా సర్వేలో రెట్టింపు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సమయంలో తెలంగాణలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య 60.7 శాతంగా ఉంది. 2019 నుంచి 2021 మధ్య జరిగిన గత సర్వేతో తాజా సర్వేను పోలిస్తే, కేవలం తెలంగాణలో మాత్రమే సిజేరియన్ల సంఖ్య రెట్టింపైంది. మరే రాష్ట్రంలో కానీ, కేంద్ర పాలిత ప్రాంతంలో కానీ ఈ సంఖ్య పెరగలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సిజేరియన్ల సంఖ్య 52.2 శాతంగా నమోదైంది. ఇక నాగాలాండ్‌లో అత్యల్పంగా 13.2 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న ఆపరేషన్ల గురించి కూడా సర్వేలో వెల్లడించారు.
తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 83.9 శాతం డెలివరీలు సిజేరియన్ పద్ధతిలో జరుగుతున్నాయని, ఇక జాతీయ సగటు కేవలం 54.1 శాతం మాత్రమే ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా 48.1 శాతం సిజేరియన్ రేటు ఉన్నట్లు తేలింది.
ఇక జాతీయ సగటు 16.9 శాతం మాత్రమే. గర్భం వచ్చిన మొదటి 100 రోజుల వరకు తెలంగాణలోని 81 శాతం మంది గర్భిణులు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మందులు వాడినట్లు నివేదికలో తెలిపారు. ఇక జాతీయ సగటు కేవలం 54.9 శాతం మాత్రమే ఉంది.
