తెలంగాణ ఉద్యమ యోధుడు కమాలుద్దీన్ సేవలు చిరస్మరణీయం
తెలంగాణ ఉద్యమ యోధుడు కమాలుద్దీన్ సేవలు చిరస్మరణీయం
-ఉద్యమ నాయకులను గుర్తించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి
-కమాలుద్దీన్ అహ్మద్‌కు తగిన గౌరవం కల్పించాలని వారసులు, అభిమానుల విజ్ఞప్తి
పరకాల, ఆంధ్రప్రభ:
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దివంగత నాయకుడు ఎం. కమాలుద్దీన్ అహ్మద్ భౌతికంగా లేకపోయినా తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన వారసులు, అభిమానులు పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పోరాడిన అనేక మంది ఉద్యమకారులను నాటి టీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ ప్రభుత్వాలు సముచితంగా గుర్తించడంలో విఫలమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమ చరిత్రలో కమాలుద్దీన్ అహ్మద్ పాత్ర విశేషమని వారు గుర్తు చేశారు. తెలంగాణ ఆర్థిక వెనుకబాటుతనాన్ని దేశ స్థాయిలో ప్రస్తావించిన తొలి నాయకుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. రాజకీయ కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌కు పరిమితం కాకుండా గ్రామీణ తెలంగాణ సమస్యలను జాతీయ వేదికలపై వినిపించిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.
కమాలుద్దీన్ అహ్మద్ 1962, 1967లో చెరియాల్, జనగామ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వరంగల్, హన్మకొండ ప్రాంతాల నుంచి లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్రంలో పౌర సరఫరాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా, వాణిజ్య శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. నాఫెడ్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తెలంగాణలో సాగునీటి అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని అభిమానులు తెలిపారు. ముఖ్యంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు సాగునీరు అందించడంలో ఆయన పాత్ర ఉందన్నారు. 1997లో లోక్‌సభలో తెలంగాణ వెనుకబాటుతనంపై ఆయన చేసిన ప్రసంగం ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచిందని పేర్కొన్నారు.
తెలంగాణ అంశాన్ని బలంగా ప్రస్తావించిన తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినప్పటికీ తన సిద్ధాంతాలను విడిచిపెట్టలేదని అభిమానులు గుర్తు చేశారు. అనంతరం ప్రణాళికా సంఘ సభ్యుడిగా, 2002 నుంచి 2004 వరకు సౌదీ అరేబియాలో భారత రాయబారిగా సేవలందించారని తెలిపారు.
2018లో కమాలుద్దీన్ అహ్మద్ మరణించినప్పుడు రాష్ట్ర అంత్యక్రియలు నిర్వహించకపోవడం బాధాకరమని ఆయన అనుచరులు పేర్కొన్నారు. తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడికి కనీస గౌరవం కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఉద్యమ చరిత్ర కమాలుద్దీన్ అహ్మద్ పేరు లేకుండా అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొంటూ, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆయన సేవలను అధికారికంగా గుర్తించి కుటుంబ సభ్యులకు, వారసులకు తగిన గౌరవం కల్పించాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఆయన చేసిన త్యాగాలు, సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు.
