వ్యవసాయ భూముల కబ్జా కలకలం
వ్యవసాయ భూముల కబ్జా కలకలం
– వ్యవసాయ భూములను కౌలుకు తీసుకుని కాజేసే యత్నం?
-అక్రమ పట్టాల సృష్టిపై సంచలన ఆరోపణలు.
-విదేశాల్లో ఉన్న యజమాని భూమిపై కన్నేసిన కబ్జాదారులు?
-అక్రమ పట్టాలతో కోట్ల విలువైన భూమి కబ్జా ప్రయత్నం.. అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్
-ఎడపల్లి మండలం లో హాట్ టాపిక్ గా భూవివాదం
-రెవెన్యూ అధికారుల పాత్రపై విచారణకు డిమాండ్
ఎడపల్లి, ఆంధ్రప్రభ:
ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ సమీపంలో ఉన్న 17 ఎకరాల 12 గుంటల వ్యవసాయ భూమిని అక్రమంగా కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎంఎస్‌సీ ఫారం గ్రామానికి చెందిన మహమ్మద్ అంకుష్ అనే వ్యక్తి ఆరోపించారు. ఆదివారం సాటాపూర్ గేట్ సమీపంలో గల ఆక్రమిత ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యవసాయ భూమి వద్ద మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
అంకుష్ అనే వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, సర్వే నెంబర్ 598 లో తన యజమాని ఆర్. కే మూర్తి కి 6.19 ఎకరాలు, సర్వే నెంబర్ 597 లో భగవతి కర్ణా పేరిట 5.20, 599 లో 5.13 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ భూమి ఉండగా, యజమానులు విదేశాల్లో నివసిస్తుండటంతో భూముల నిర్వహణ కోసం తనకు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారని చెప్పారు. 2021లో వ్యవసాయ సాగు నిమిత్తం కౌలుకు ఇచ్చిన ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం ఆ భూమి తనదేనంటూ హక్కులు చెలాయిస్తున్నాడని ఆరోపించారు.
అంతేకాకుండా, 2005 సంవత్సరంలోనే భూమిని కొనుగోలు చేసినట్లు దొంగ పత్రాలు, నకిలీ రికార్డులు సృష్టించి యాజమాన్య హక్కులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 17 ఎకరాల 12 గుంటల భూమికి అక్రమంగా పట్టాలు సృష్టించే ప్రక్రియలో కొందరు రెవెన్యూ అధికారులు సహకరించారని కూడా ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, నకిలీ పత్రాలు సృష్టించిన వారితో పాటు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంకుష్ ఎడపల్లి తహసీల్దార్ ను కోరారు.
అసలు భూ రికార్డులు, యాజమాన్య పత్రాలు, పవర్ ఆఫ్ అటార్నీ ఆధారాలను పరిశీలించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏ.ఆర్.పి క్యాంప్ కు చెందిన వాగ్మారే సూర్యకాంత్ మాట్లాడుతూ…. గతంలో తాను సైతం అట్టి 17 ఎకరాల పై చిలుకు భూమిలో వ్యవసాయం నిర్వహించడం జరిగిందని, అంకుష్ అనే వ్యక్తి ద్వారా కౌలు డబ్బులను సైతం భూ యజమానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. గత 45 సంవత్సరాలుగా తాము ఈ ప్రాంతంలోనే పుట్టి పెరగడం, నివసించడం జరిగిందని తమకు తెలిసినంత వరకు ఈ వ్యవసాయ భూమి అంకుష్ అనే వ్యక్తి చెప్పినవారికి చెందిన వ్యవసాయ భూమని స్పష్టం చేశారు.
ఇట్టి వ్యవసాయ భూముల ఆక్రమణకు సంబంధించి జిల్లా కలెక్టర్ చొరవ చూపి కోట్ల విలువైన భూమిని కాజేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా సమావేశం లో మండల వాసులు పాషా ఖాన్, శ్రీనివాస్ గౌడ్, నితిన్, మేశక్ రాజు, నిహాల్, షేక్ ఉస్మాన్, చోటు మియా, దావూద్, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
