BJP Counter | సీఎంకు బీజేపీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్
BJP Counter | సీఎంకు బీజేపీ చీఫ్ స్ట్రాంగ్ కౌంటర్
BJP Counter | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పొలిమేర కూడా దాటనీయమంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఘాటుగా స్పందించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
మా పార్టీ కార్యకర్తలు తలచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు గ్రామాల్లో తిరగలేరని రామచందర్ రావు హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరికీ రాజకీయ కార్యకలాపాలు నిర్వహించే హక్కు ఉందన్నారు.
కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ముందుగా పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. రైతుల అభ్యంతరాలను పక్కనపెట్టి ప్రభుత్వం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించిందని విమర్శించారు.
భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం సమంజసం కాదని రామచందర్ రావు అన్నారు. రైతులకు న్యాయం చేసిన తర్వాతే కోహెడ పండ్ల మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
