ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: దాస్యం వినయ్ భాస్కర్
ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: దాస్యం వినయ్ భాస్కర్
కేసీఆర్ హయాంలో రూ.77 కోట్ల పన్నులు మాఫీ చేశాం
హనుమకొండ, (ఆంధ్రప్రభ): బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటో కార్మికులకు అండగా నిలిచారని, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. ఆటో అడ్డాల ఏర్పాటు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు తగ్గించడం వంటి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.
ఆదివారం పాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో కార్మికుల కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.77 కోట్ల పన్నులను మాఫీ చేసిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు అనేక హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులతో కలిసి ప్రయాణాలు చేసి, వారి సమస్యలను తెలుసుకున్నప్పటికీ తెలంగాణలో ఇచ్చిన హామీలను మరిచిపోయారని అన్నారు.
ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని, అలాగే ఆటో కార్పొరేషన్ ఏర్పాటు హామీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే సహకార, కార్మిక సంఘాల అభివృద్ధికి ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
నేటి నుంచి పది రోజుల పాటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, నాయకులు పులి రజనీకాంత్, ఇమ్మడి రాజు, ఆటో కార్మిక సంఘం నాయకులు ఉప్పుల రాజేందర్, రామ్‌చందర్, రవీందర్, సురేష్, గణేష్, రవి, సుదర్శన్, సమీర్, శరత్, నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
