Job Fraud I నందూస్ వరల్డ్ దంపతులపై భారీ ఛీటింగ్ కేసు

Job Fraud I నందూస్ వరల్డ్ దంపతులపై భారీ ఛీటింగ్ కేసు

Job Fraud I ఇబ్రహీంపట్నం ఎన్టీఆర్, ఆంధ్రప్రభ: యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి రూ.కోట్లు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య, యూట్యూబర్‌, నటి రామా నందన అలియాస్ నందుపై ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

విదేశాల్లో లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి, డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులు బాధితుల నుంచి పెద్ద ఎత్తున నగదు డిపాజిట్ చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కార్యాలయాలు మూసివేసి కనిపించకుండా పోయారనే ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.

ఈ వ్యవహారంపై పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన బాధితుడు ఎం. శివక్రాంతి గత ఏడాది ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు క్రైం నంబర్ 515/2025 కింద జాగర్లమూడి మధుకర్, రామా నందన అలియాస్ నందు, మధుకర్ తండ్రి మోహనరావుపై కేసు నమోదు చేశారు.

గత రెండు రోజులుగా పలు టీవీ ఛానళ్లలో కథనాలు ప్రసారం కావడం, పత్రికల్లో వార్తలు రావడం, సోషల్ మీడియాలో ఈ వ్యవహారం వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్లు చెబుతున్న మధుకర్, నందు భారత్‌కు వస్తే ఎయిర్‌పోర్టులో నిలిపివేసి అరెస్టు చేసేలా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

రామా నందన ‘నందూస్ వరల్డ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. ఆమె ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో నటించినట్లు కూడా సమాచారం. ఈ గుర్తింపును ఉపయోగించుకుని మధుకర్, రామా నందన దంపతులు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

విదేశీ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరుతో బాధితుల నుంచి రూ.కోట్లలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరుకు చెందిన ఈ దంపతులు ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి వీసా రెన్యువల్‌తో పాటు తన భార్యకు ఉద్యోగం కోసం సీవోఎస్ ఇప్పిస్తామని చెప్పడంతో మధుకర్‌ను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకోసం రూ.15 లక్షలు చెల్లించాలని మధుకర్ చెప్పగా, 2023లో నిందితులు తెలిపిన రెండు బ్యాంకు ఖాతాలకు ఆ మొత్తాన్ని బదిలీ చేసినట్లు బాధితుడు తెలిపాడు.

శివక్రాంతి ఫిర్యాదు, దీనిపై వచ్చిన ప్రత్యేక కథనాలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఏ1గా మధుకర్, ఏ2గా రామా నందన, ఏ3గా మోహనరావును పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. వారికి పోలీసులు నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన రాలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తమపై నమోదైన కేసును కొట్టివేయాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ పిటిషన్ విచారణలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన బాధితులు సోషల్ మీడియాలో తమ అనుభవాలను వెల్లడిస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి గరిష్ఠంగా సుమారు రూ.20 లక్షల వరకు వసూలు చేసి మోసం చేశారనే ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కేసు నమోదు కాగానే రామా నందన ‘విమెన్’ విక్టిమ్ కార్డు ఉపయోగిస్తూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోసపోయిన వారినే హేళన చేస్తూ వీడియోలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బాధితుల వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply