అమరావతిపై విషప్రచారం మానుకోవాలి: దేవినేని ఉమ

అమరావతిపై విషప్రచారం మానుకోవాలి: దేవినేని ఉమ

విజయవాడ, ఆంధ్రప్రభ: రాజధాని అమరావతి అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అమరావతిపై ఇకనైనా విషప్రచారం మానుకోవాలని సూచించారు.

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని రైతుల భూములు వెనక్కి ఇచ్చేస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారని, అవి బాధ్యతారహిత వ్యాఖ్యలని విమర్శించారు.

గత ఐదేళ్లపాటు తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమైన జగన్‌ పరదాల మధ్య పాలన చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. రెండేళ్లుగా శాసనసభకు కూడా రాకుండా, సభలో చర్చించేందుకు ధైర్యం లేని వ్యక్తి ఇప్పుడు అమరావతి అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు నిర్మించిన భవనాల్లోనే గత ప్రభుత్వం పరిపాలన సాగించిందని, రాజధానిలో తట్టమట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. అమరావతిలో ప్రస్తుతం 30 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు అభివృద్ధి పనుల్లో పాల్గొంటుండగా, వాటిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై కూడా సరైన అవగాహన లేకపోవడం విచారకరమని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు.

రాజధానికి భూములు ఇవ్వని కొందరు రైతులను ముందుకు తెచ్చి మళ్లీ అమరావతిపై కుట్రలు ప్రారంభించారని ఆరోపించారు. ఫేక్‌ సోషల్‌ మీడియా ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

భోగాపురం విమానాశ్రయంపై గతంలో ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన వారు, ఇప్పుడు అక్కడ బోయింగ్‌ విమానం దిగుతున్న వాస్తవాన్ని చూడాలని దేవినేని ఉమ అన్నారు. జూలై నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుందని తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంత ముఖచిత్రం మారబోతోందన్నారు.

ప్రపంచ స్థాయి బిట్స్‌ పిలానీ సంస్థ అమరావతిలో నిర్మాణ దశలో ఉండటం, రాజధాని అభివృద్ధి పనులు వేగంగా సాగుతుండటం వైసీపీకి ఇష్టం లేకపోవడంతోనే విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంస రాజకీయాలు భావితరాలకు గుర్తుండిపోతాయని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. కూల్చివేతకు గురైన ప్రజావేదిక శిథిలాలు జగన్‌ చేసిన విధ్వంసానికి చిహ్నంగా అమరావతిలో నిలుస్తాయని అన్నారు.

రాజధాని ప్రాంతంలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను అడ్డుకునేందుకు కేసులు వేయించారని, రైతులు, మహిళలను ఇబ్బందులకు గురిచేశారని ఆయన ఆరోపించారు. అమరావతి రైతుల త్యాగాల వల్లే రాజధాని నిలబడిందని అన్నారు.

మహిళల కన్నీళ్లు, ఉసురు తగలడం వల్లే గత ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైందని దేవినేని ఉమ వ్యాఖ్యానించారు. బందర్‌ పోర్టు, అమరావతి వంటి అభివృద్ధి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని విమర్శించారు.

హైదరాబాద్‌లోని తన ఆస్తులు, రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో విషపు బీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారని జగన్‌పై ఆరోపించారు. వేల కోట్ల భూ, ఇసుక, మద్యం, మైనింగ్‌ అవినీతి కేసులు తరుముకొస్తుండటంతోనే జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అన్నారు.

ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా వైసీపీలో మార్పు రాలేదని దేవినేని ఉమ అన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందించే కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వం చేపట్టలేదని విమర్శించారు.

డీఎస్సీ విషయంలో ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాబోయే రెండేళ్లలో అమరావతి నిర్మాణ పనులు చాలా వరకు పూర్తవుతాయని, రాజధాని అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని దేవినేని ఉమ స్పష్టం చేశారు.

Leave a Reply