Rajesh Exports Scam | ఇన్వెస్ట‌ర్లు ల‌బోదిబో..

Rajesh Exports Scam | ఇన్వెస్ట‌ర్లు ల‌బోదిబో..

  • రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గోల్మాల్‌తో ఎల్‌ఐసీకి భారీ షాక్!

స్టాక్ మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వ్యవహారం ఇప్పుడు ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కంపెనీ ఆర్థిక లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గుర్తించడంతో, షేర్లు వరుసగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్‌ఐసీ (LIC)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సెబీ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (FY21-FY25) దాదాపు రూ.15.15 లక్షల కోట్ల ఆదాయాన్ని తన నివేదికల్లో చూపించినప్పటికీ, వాస్తవ ఆదాయం మాత్రం కేవలం రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన తమ అనుబంధ సంస్థ ‘వాల్‌కాంబి’ (Valcambi) ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్లు సెబీ గుర్తించింది.

ఈ నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్ రాజేష్ మెహతాపై మార్కెట్ లావాదేవీల నిషేధం విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు భారీగా కుప్పకూలాయి. వరుసగా లోయర్ సర్క్యూట్‌ను తాకుతూ షేర్ ధర పతనమవుతుండటంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది.

ఎల్‌ఐసీకి భారీ దెబ్బ

రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఎల్‌ఐసీకి సుమారు 10.8 శాతం వాటా ఉంది. అంటే దాదాపు 3.18 కోట్ల షేర్లు ఎల్‌ఐసీ చేతిలో ఉన్నాయి. షేర్ ధర భారీగా పడిపోవడంతో ఎల్‌ఐసీ పెట్టుబడుల విలువ గణనీయంగా తగ్గింది. దీంతో పాలసీదారుల నిధుల భద్రతపై కూడా చర్చ మొదలైంది.

అయితే సెబీ ఆరోపణలను రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ పూర్తిగా ఖండించింది. దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తామని, తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇస్తామని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నాయి.

ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. సెబీ తదుపరి చర్యలు, కంపెనీ వివరణల ఆధారంగా పరిస్థితి మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వివాదం ఇప్పుడు కేవలం ఒక కంపెనీకి సంబంధించిన అంశంగా కాకుండా, ఎల్‌ఐసీ వంటి దిగ్గజ సంస్థల పెట్టుబడి విధానాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Leave a Reply