Harish Rao Letter | జల హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీత

Harish Rao Letter | జల హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీత

Harish Rao Letter | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తెలంగాణ జల హక్కుల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా రాష్ట్ర జల వనరులు, సాగునీటి ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

హరీశ్‌రావు లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎత్తిపోతల పంపుల నిర్వహణ విషయంలో గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పలుమార్లు హెచ్చరించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదన్నారు. దీంతో పంపులు దెబ్బతిని కాళేశ్వరం, దేవాదుల వంటి కీలక ప్రాజెక్టుల నిర్వహణలో లోపాలు తలెత్తాయని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల సాగునీటి వ్యవస్థ దెబ్బతింటోందని విమర్శించారు.

కృష్ణా నది జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్ఠ స్థాయికి చేరుకుందని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ 74 శాతం నీటిని వినియోగిస్తుండగా, తెలంగాణ వాటా కేవలం 25 శాతానికే పరిమితమైందని లేఖలో ప్రస్తావించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రమైన నష్టమని పేర్కొన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ విధానాల కారణంగా రైతులు, తాగునీటి అవసరాలు, పరిశ్రమల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా సోలార్‌ ఆధారిత విద్యుత్ విధానాలు సాగునీటి రంగానికి ముప్పుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రైతు డిస్కం ఏర్పాటు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అలాగే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణకు తగిన నిధులు కేటాయించి వాటి పనితీరును మెరుగుపరచాలని సూచించారు. తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర జల హక్కులను సమర్థవంతంగా కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

Leave a Reply