చెట్లు నాటుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం
చెట్లు నాటుదాం.. ప్రకృతిని కాపాడుకుందాం
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి లక్ష్యంగా మారాలని, చెట్లను నాటి వాటిని సంరక్షించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవాలని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరావు పిలుపునిచ్చారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు మానవాళికి సవాళ్లుగా మారుతున్నాయని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు అధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతూ, పేద దేశాలపై ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. యుద్ధాల కారణంగా కూడా పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
దేశంలో హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. నంద్యాల జిల్లా పరిధిలో నల్లమల అడవులు క్రమంగా క్షీణిస్తుండటంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చెట్లు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం ఆధ్వర్యంలో పేదలు నివసించే ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారు, న్యాయవాది బి. శంకరయ్య, అబులైస్, రియాజ్, సీపీఐ నాయకుడు ప్రసాదు, గోపాల్, వెంకటేష్, కరీంభాషా, సంజీవరాయుడు, మురళీధర్, దర్శకుడు కోటేంద్రరావు, ఎండి రఫీ, లక్ష్మీదేవి, సరోజమ్మ తదితరులు పాల్గొన్నారు.
