పాఠశాలలను ‘నెట్-జీరో’లుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్
పాఠశాలలను ‘నెట్-జీరో’లుగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్
వ్యర్థాల నియంత్రణ, హరిత ఇంధన వినియోగమే ముఖ్య లక్ష్యం
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను ‘నెట్-జీరో’ (కార్బన్ ఉద్గారాల రహిత), శూన్య వ్యర్థాల పాఠశాలలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. పెద్దపాడు పంచాయతీ పరిధిలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించుకోవాలని, తడి-పొడి వ్యర్థాల వేరుచేయడం, సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, హరిత ఇంధన వినియోగం వంటి పద్ధతులను అలవర్చుకోవాలన్నారు. ప్లాస్టిక్ వాడకం, గ్యాస్ ఉద్గారాల వల్లే ఉష్ణోగ్రతలు పెరిగి ఈ ఏడాది వర్షాలు ఆలస్యమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలను నెట్-జీరోగా మారిస్తే అదనపు వనరులు కల్పిస్తామని హామీ ఇస్తూ, పాఠశాల మైనర్ మరమ్మతుల కోసం రూ.70 లక్షలు మంజూరయ్యాయని కలెక్టర్ వెల్లడించారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనురాధ, ఆర్డీవో సాయి ప్రత్యూష మాట్లాడుతూ.. జిల్లాలోని 11 ఎంజేపీ గురుకులాలో నెట్-జీరో భావనను అమలు చేస్తున్నామని, సౌరశక్తి, వర్షపు నీటి నిల్వ వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా నేర్పించాలని సూచించారు.
జిల్లా అటవీ శాఖ అధికారి జ్ఞాన ప్రసూన మాట్లాడుతూ.. జిల్లాలో గ్రీన్ కవర్‌ను పెంచేందుకు ఈ ఏడాది 3.5 లక్షల హెక్టార్లలో ప్లాంటేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రయోగాత్మకంగా 30 హెక్టార్లలో మడ అడవుల పెంపకం చేపడుతున్నామన్నారు. అడవుల శాతం పెంచేందుకు డ్రోన్ల సహాయంతో జిల్లావ్యాప్తంగా 8 లక్షల విత్తన బంతులను (సీడ్ బాల్స్) చల్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. ఈ వేడుకల్లో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. జయశ్రీ, ఎస్ఎమ్‌సీ చైర్మన్ ఎర్రయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
